వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దొరబాబు
పెద్దాపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ డ్రామాలాడిన కూటమి ప్రభుత్వం.. హైకోర్టు ఆ జీవోలను కొట్టివేయడంతో ఇప్పుడు మరో డ్రామాకు తెరతీసిందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు విమర్శించారు. పెద్దాపురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పడం దారుణమన్నారు. ప్రభుత్వానికి బీసీలపై ప్రేమ ఉంటే మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్జీ వర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా పైకి తీసుకురావడానికి అన్ని స్థాయిల్లో అవకాశాలు కల్పించారన్నారు. దేశంలోనే తొలిసారి అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పదవులు, డైరెక్టరు పదవులు కల్పించి రాజకీయంగా ఉన్నత స్థితిలో కూర్చోబెట్టారన్నారు. సంక్షేమ పథకాల్లోనూ బీసీలకు తొలి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ వెంట ఉన్న బీసీలను తమ పార్టీ వైపునకు తిప్పుకోవాలనే దురాలోచనతో బీసీ రిజర్వేషన్ల అంశంతో మభ్యపెట్టి లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని మోసాలకు పాల్పడినా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ బీసీలు జగన్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.


