మృతుడి బంధువుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

మృతుడి బంధువుల ఆందోళన

Oct 4 2026 10:01 AM | Updated on Oct 4 2026 10:01 AM

సామర్లకోట పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

సామర్లకోట: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తన భర్త కాలిన మురళీకృష్ణ (35) మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారని, దీనిపై పూర్తి విచారణ చేయాలని మృతుడి భార్య లత పిల్లలతో కలిసి సామర్లకోట పోలీస్‌ స్టేషన్‌ వద్ద బైటాయించారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

కాకినాడలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న మురళీకృష్ణ పెద్దాపురంలో తన ఇంటికి మోటారు సైకిల్‌పై వస్తున్నాడు. ఈ సమయంలో సామర్లకోట– కాకినాడ రోడ్డులో పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత కుమార రామభీమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే వంతెన వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అతను మృతి చెందాడు. ఆ మృతదేహాన్ని పోలీసులు పోర్టుమార్టం నిమిత్తం సామర్లకోట సీహెచ్‌సీకి తరలించారు. మృతుడి వద్ద ఉన్న ఆధారాల మేరకు అతని భార్య లతకు, బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. దాంతో తొండంగి మండలం కొత్త పెరుమాళ్లపురం నుంచి బంధువులు, కుటుంబ సభ్యులు, పెద్దాపురం నుంచి భార్య లత తన పిల్లలతో పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఉద్దేశ పూర్వకంగానే వాహనంతో ఢీకొని తన భర్తను చంపేశారని లత ఆరోపించారు. గాయపడిన వ్యక్తిని అంబులెన్సులో తీసుకెళ్లకుండా, రిక్షాలో తీసుకు వెళ్లడం ఏంటని బంధువులు ప్రశ్నించారు. ఆ ప్రదేశంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి తనకు న్యాయం చేయాలని, అప్పటి వరకు పోలీస్‌ స్టేషన్‌ నుంచి కదిలేది లేదిని భీష్మించారు. తనకు ఆస్మితకృష్ణ (5), సిరి (3) అనే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, తమకు దిక్కెవరంటూ లత రోదించిన తీరు కలచివేసింది. ఢీకొన్న వాహనం కోసం గాలిస్తున్నామని, ఘటనా స్థలం వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement