ప్రాణం తీసిన నిద్ర మత్తు | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన నిద్ర మత్తు

Oct 3 2026 12:20 AM | Updated on Oct 3 2026 12:20 AM

● బైక్‌పై వెళ్తూ రోడ్డుపై

జారిపడిన యువకుడు

● తలపై నుంచి గుర్తుతెలియని

వాహనం వెళ్లడంతో మృతి

చౌటుప్పల్‌ : ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న యువకుడు నిద్రమత్తులో కింద పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం అతడి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. సీఐ జి.మన్మథకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన కుంచె లారెన్స్‌ (26) ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా రెండు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. ఎర్రగడ్డలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. సొంతూరు వెళ్లేందుకు హాస్టల్‌లో తనతో పాటు ఉండే శివప్రసాద్‌ అనే యువకుడితో కలిసి గురువారం రాత్రి బైక్‌పై బయల్దేరాడు. శివప్రసాద్‌ బైక్‌ నడుపుతుండగా లారెన్స్‌ వెనుక కూర్చున్నాడు. చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్దకు రాగానే తనకు నిద్ర వస్తోందని లారెన్స్‌ స్నేహితుడికి చెప్పాడు. దీంతో ప్రయాణాన్ని విరమించుకుని వారిద్దరూ తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరారు. శుక్రవారం తెల్లవారుజామున దండుమల్కాపురం గ్రామ శివారులోని ఆంథోల్‌ మైసమ్మ దేవాలయం వద్దకు చేరుకునేసరికి లారెన్స్‌కు మళ్లీ నిద్రముంచుకొచ్చి బైక్‌ పైనుంచి రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం అతడి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement