విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు

Sep 28 2026 12:35 AM | Updated on Sep 28 2026 12:35 AM

● ప్రభుత్వం తీరుపై వైఎస్సార్‌సీపీ

జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆగ్రహం

● ఈ ఘటనపై కలెక్టర్‌ విచారణ

జరిపించాలని డిమాండ్‌

తుని: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వసతుల కల్పనతో పాటు ఆరోగ్య రక్షణలో అధికార యంత్రాంగం విఫలమైందని, ఇందుకు తుని ఘటన ఉదాహరణగా నిలుస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. ఆదివారం తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాల విద్యార్థినులను ఆయన పరామర్శించారు. బాధిత బాలికల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడులో పాఠశాలలను నందనవనంలా ఆధునికీకరించి పిల్లలను మేనమామలా ప్రేమగా చూసుకున్నారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. శనివారం సాంబారులో బల్లి పడిన కలుషిత ఆహారం తిని 23 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురి కావడం తన మనసును కలచివేసిందన్నారు. గతంలో తుని నియోజకవర్గ పరిధిలో ఇదే మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్న అల్లూరి సీతారామరాజు ట్రస్టు నాసిరకం భోజనం సరఫరా చేయడంపై చర్యలు తీసుకున్నట్టు రాజా తెలిపారు. కొన్ని రోజుల పాటు తన సొంత సొమ్ముతో విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆసుపత్రికి తీసుకువచ్చిన బాలికలకు పూర్తి స్థాయిలో వైద్యం అందించకుండా బలవంతంగా ఇళ్లకు పంపించడం సరికాదన్నారు. ఆసుపత్రిలో 23 మంది చేరగా 20 మందిని డిశ్చార్జి చేశారని, అంత తొందర ఎందుకని ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులపై కలెక్టర్‌ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నవరం శ్రీను, రేలంగి రమణాగౌడ్‌, బోడపాటి సతీష్‌, చింతల సునీత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement