బోట్‌క్లబ్(కాకినాడసిటీ): ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం ఈ నెల 28న యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల అధికారులూ విధిగా హాజరుకావాలని ఆదేశించారు.
ఉద్యోగులు హక్కుల కోసం పోరాడితే తప్పా?
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి
కాకినాడ రూరల్: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ను మించిపోయిందని, హక్కుల కోసం ఉద్యోగులు పోరాటం చేయడం తప్పా అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి మండిపడ్డారు. కాకినాడలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో సచివాలయ ఉద్యోగులను అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన అరాచకంగా మారిందని, ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కులను పోరాటాల ద్వారా సాధించుకున్న అనేక సందర్భాలు ఉన్నాయని చెప్పారు. హక్కులను కాలరాస్తే ప్రభుత్వాలను మార్చే సంఘటనలు గతంలో ఉన్నాయని హెచ్చరించారు. ఉద్యోగుల న్యాయ పోరాటానికి అడ్డంకులు పెట్టడం మానుకుని వారి డిమాండ్లను పరిష్కరించాలని హితవు పలికారు. కూటమి పాలనలో తప్పులు బయటపెడుతున్న మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని, రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై నిబద్ధతతో వార్తలు ఇస్తున్న పత్రికలు, ప్రసారం చేస్తున్న చానళ్ళ గొంతు నొక్కాలని చూడడం దుర్మార్గమని చెప్పారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు, ప్రధాన మీడియా చానళ్ళకు మైనింగ్, కాంట్రాక్టులు ఎరగా వేసి వ్యతిరేక మీడియాను అణచివేస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. కూటమికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని నాగమణి స్పష్టం చేశారు.
ఉత్సాహంగా చెకుముకి సైన్స్ సంబరాలు
పిఠాపురం: జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు ఆదివారం ఘనంగా జరిగాయి. స్థానిక రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్‌లో జేవీవీ జిల్లా అధ్యక్షుడు కేఎంఎంఆర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ పీఎన్ రాజు, జిల్లా గౌరవ అధ్యక్షుడు కాదా వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక ప్రయోగాలతో శాసీ్త్రయ దృక్పథం పుస్తకాన్ని ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 37 బృందాల్లో 111 మంది విద్యార్థులు చెకుముకి టెస్ట్ ఆడియో విజువల్ రౌండ్, ర్యాపిడ్ రౌండ్‌లలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పెదపూడి హైస్కూల్ ప్రథమ, సామర్లకోట హైస్కూల్ ద్వితీయ, తొండంగి మండలం ఎ.కొత్తపల్లి హైస్కూల్ తృతీయ స్థానాల్లో నిలిచాయి. ప్రైవేటు పాఠశాలల్లో తుని శ్రీప్రకాష్ విద్యానికేతన్ ప్రథమ, పిఠాపురం భాష్యం స్కూల్ ద్వితీయ, కాకినాడ రూరల్‌లోని ఆదిత్య స్కూల్ తృతీయ స్థానాల్లో నిలిచాయని నిర్వాహకులు తెలిపారు. ప్రథమ స్థానంలో నిలిచిన పాఠశాలలు రాష్ట్రస్థాయి సంబరాల్లో పాల్గొంటాయని జిల్లా చెకుముకి కన్వీనర్ జీహెచ్‌పీఎస్ వర్మ చెప్పారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు, జేవీవీ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రత్నగిరి.. భక్తజనఝరి
అన్నవరం: అన్నవరం సత్యదేవుని ఆలయానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాధారణంగా భాద్రపద మాసంలో పెద్దగా భక్తులు రారు. దీనికితోడు ఆర్నాబ్ తుపాను ప్రభావంతో మంగళవారం నుంచి శుక్రవారం వరకు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురియడంతో భక్తులు నామమాత్రంగా వచ్చారు. శనివారం నుంచి వర్షాలు తగ్గడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి సత్యదేవుడిని దర్శిస్తున్నారు. ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు రత్నగిరికి తరలివచ్చారు. దీంతో స్వామివారి ఆలయం, క్యూ లైన్లు, వ్రత మండపాలు అన్నీ భక్తులతో నిండిపోయాయి. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారని అధికారులు తెలిపారు. 1500 వ్రతాలు జరిగాయని, అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలు ఆదాయం వచ్చిందని తెలిపారు. సత్యదేవుని అన్నప్రసాదం ఐదువేల మంది స్వీకరించారని అధికారులు చెప్పారు.


