జెడ్పీ విభజన | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ విభజన

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

వడివడిగా

సాక్షి, అమలాపురం: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా జిల్లా ప్రజా పరిషత్తుల (జెడ్పీ) పునర్వ్యవస్థీకరణ వేగమందుకుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ నాలుగు జిల్లా పరిషత్‌లుగా పునర్విభజన జరగనుంది. దీనికి సంబంధించి ఈ నెల ఐదో తేదీన ఆదేశాలిచ్చిన ప్రభుత్వం, ఈ నెల 25 నుంచి కొత్త జెడ్పీల కార్యకలాపాలు ప్రారంభించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24లోగా ప్రస్తుత పరిషత్తుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.

ఉమ్మడి తూర్పుగోదావరి పరిషత్‌కు ముగింపు

ప్రజలకు పరిపాలనను చేరువ చేయాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చిన్న జిల్లాలను ఏర్పాటు చేసింది. దీని వల్ల కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు జిల్లా కేంద్రాలకు, వాటికి దగ్గరగా సమీప ప్రాంతాలకు తరలిరావడంతో ప్రజలకు ఏ అవసరం వచ్చినా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉంది. జిల్లాల విభజనలకు కొనసాగింపుగా ప్రభుత్వం ఇప్పుడు జెడ్పీల విభజనకు సిద్ధమైంది. ప్రస్తుత ఉమ్మడి జెడ్పీ పదవీ కాలం ముగుస్తుండడంతో విభజన చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం సెప్టెంబరు ఐదో తేదీన జారీ చేసిన 115, 116 జీవోల ఆధారంగా పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నెల 25 నుంచి కొత్త జిల్లా ప్రజా పరిషత్తులు అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్‌ విభాగం ఈ నెల 16న సర్క్యులర్‌ మెమో జారీ చేసింది. దీని ప్రకారం కొత్త జెడ్పీల ఏర్పాటులో ఫైళ్లు, రికార్డుల విభజనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పాత పరిషత్‌ కార్యాలయాల్లోని ఈ–ఫైళ్లు, మాన్యువల్‌ ఫైళ్లు, రికార్డు గదుల్లోని మూసివేసిన ఫైళ్లతో పాటు పరిపాలన, ఆస్తులు, సర్వీసు వ్యవహారాలు, ఎన్నికలు, కోర్టు కేసులకు సంబంధించిన రిజిస్టర్లను గుర్తించి పూర్తి జాబితా సిద్ధం చేయాలని ఆదేశించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జెడ్పీ పరిధిలో దశాబ్దాలుగా కొనసాగిన పరిపాలనా వ్యవస్థకు ముగింపు పలికి నాలుగు కొత్త వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం జిల్లాలకు నాలుగు ప్రత్యేక జిల్లా ప్రజా పరిషత్తులు ఏర్పడనున్నాయి. కాకినాడ జెడ్పీ 20 మండలాలు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జెడ్పీ 19, తూర్పుగోదావరి జెడ్పీ 22 మండలాలు, పోలవరం జెడ్పీ 11 మండలాలతో ఏర్పడనున్నాయి.

25న కొత్త సీఈవోల బాధ్యతలు

కొత్త జిల్లా పరిషత్తులకు ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సీఈవోలు), ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (డీసీఈవోలు) నియామకానికి ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త సీఈవోలు ఈ నెల 25న బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాత పరిషత్‌ అధికారులతో సమన్వయం చేసుకుని రికార్డులు, ఫైళ్లు, ఇతర పరిపాలనా వ్యవహారాలను స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏర్పడనున్న 3 జిల్లా ప్రజా పరిషత్తులకు అధికారులు, సిబ్బందిని కేటాయించనున్నారు. ప్రస్తుత సిబ్బందిని తాత్కాలికంగా కొత్త పరిషత్తులకు సర్దుబాటు చేయనున్నారు. తుది సిబ్బంది కేటాయింపు రాష్ట్రపతి ఉత్తర్వులు–2025 ప్రకారం చేపట్టనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆస్తులు, నిధులపైనా త్వరలో స్పష్టత

జెడ్పీల విభజనలో ఫైళ్లు, రికార్డులే కాకుండా ఆస్తులు, నిధులు, అప్పులు, మౌలిక సదుపాయాల పంపిణీ కూడా కీలకం కానుంది. వీటిపై ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 25లోగా బదిలీకి సంబంధించిన రికార్డులన్నింటినీ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారులకు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ వీఆర్‌కే తేజ మైలవరపు ఆదేశాలు జారీ చేశారు.

25 నుంచి కొత్త జిల్లా పరిషత్తులు

24తో ఉమ్మడి జిల్లా పరిషత్‌కు

చివరి రోజు

ఫైళ్లు, రికార్డుల విభజన

పూర్తి చేయాలని ప్రభుత్వ జీవో

ఉమ్మడి తూర్పుగోదావరి

జిల్లా పరిషత్‌ నాలుగుగా విభజన

తూర్పుగోదావరి, కాకినాడ,

కోనసీమ, పోలవరం

జిల్లా పరిషత్తులుగా ఏర్పాటు

కొత్త పరిషత్తులకు సీఈవో,

డిప్యూటీ సీఈవోల పోస్టింగ్‌కు కసరత్తు

సిబ్బంది తాత్కాలిక

కేటాయింపునకు ప్రతిపాదనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement