సత్యదేవుని ఆలయంలో ఐదుగురికి పదోన్నతి | - | Sakshi
Sakshi News home page

సత్యదేవుని ఆలయంలో ఐదుగురికి పదోన్నతి

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో జూనియర్‌ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఈవో నల్లం సూర్యచక్రధరరావు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వారికి పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. పదోన్నతి పొందినవారిలో నటరాజన్‌ రాంజీ, మౌనికారాజ్‌, సందీప్‌ గౌడ్‌, పేరిందేవి, సత్యభార్గవి ఉన్నారు.

వట్టిగెడ్డ వద్ద పెద్ద పులి

అప్పలరాజుపేట పరిసరాల్లో హై అలర్ట్‌

రాజవొమ్మంగి: పులి మెడలో వున్న ట్రాకర్‌ ద్వారా పెద్దపులి ప్రస్తుతం రాజవొమ్మంగి మండలం అప్పలరాజుపేటలోని వట్టిగెడ్డ రిజర్వాయర్‌ వద్దకు వచ్చినట్లు అటవీ అధికారులు గురువారం ప్రకటించారు. మెగా ఫోన్‌తో హెచ్చరికలు జారీ చేస్తు స్థానికులను అప్రమత్తం చేశారు. అప్పలరాజుపేట వద్ద గల వట్టిగెడ్డ రిజర్వాయర్‌ పరీవాహక ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు స్పష్టంగా తెలుసుకున్న రాజవొమ్మంగి ఫారెస్టు రేంజి అధికారి ఉషారాణి తమ సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లి మరోసారి ట్రాకర్‌ ద్వారా పులి ఎక్కడ వున్నది పరిశీలించారు. అనంతరం అప్పలరాజుపేట గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు సూచించారు. పశువులను మేత కోసం అడవి వైపు విడిచి పెట్టవద్దని కోరారు. అలాగే ఒంటరిగా సంచరించవద్దని, పెద్దపెద్ద శబ్ధాలు చేస్తు నిత్యం అప్రమత్తంగా వుండాలని కోరారు. కొండపోడు భూములకు వెళ్లే వారు తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు అడవిలోకి వెళ్ల వద్దని కోరారు. ఇదిలా వుండగా గురువారం అడవికి వెళ్లిన కేదారి సత్యవతి అనే గిరిజన మహిళ తనకు చాలా దగ్గరలో పులి గాండ్రింపు వినిపించిందని, దీనితో వడి వడిగా ఇంటికి చేరానని సాక్షికి తెలిపింది. పులి సంచరిస్తోందన్న వార్తలతో ఈ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. ఎఫ్‌ఎస్‌ఓ భవాని, ఎఫ్‌బీఓ సూర్యప్రసాద్‌ బేస్‌ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.

మోకాళ్లపై నిలబడి నిరసన

నిడదవోలు: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలనే డిమాండుతో ఉండ్రాజవరం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) మోకాళ్లపై నిలబడి గురువారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న తమకు పదోన్నతులు కల్పించాలని, జీతభత్యాలు పెంచాలని, నామినీలను వీఆర్‌ఏలుగా గుర్తించాలని పెద్ద పెట్టున నినదించారు. అనంతరం, తహసీల్దార్‌ పీఎన్‌డీ ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement