కాకినాడ రూరల్: విమానయాన ఇంధనం ఉత్పత్తి కాకినాడలో చేపట్టేందుకు సంబంధించిన ప్రతిపాదనపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గురువారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. పోర్టు కార్యాలయం వెనుక ఏపీ మారిటైమ్ బోర్డుకు చెందిన సుమారు 45.8 ఎకరాల్లో రూ.2500 కోట్ల పెట్రోలియం రిఫైనింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలపై ఈ కార్యక్రమం నిర్వహించారు. సుస్థిర విమానయాన ఇంధనం ఉత్పత్తి ఏడాదికి 93 వేల మెట్రిక్ టన్నులు, జీవ ఇంధనం ఉత్పత్తి ఏడాదికి 352 మెట్రిక్ టన్నులు చేపట్టే ప్రతిపాదనతో మెస్సర్స్ సాఫ్ట్‌వన్ ఇండియా ఎస్‌పికాంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చిందని వివరించారు. ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కార్మికులు, కుల సంఘాల పెద్దలు, దమ్ములపేట, డెయిరీ ఫారం సెంటర్ ప్రాంతాల ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించి వారి అభిప్రాయాలు నమోదు చేసుకున్నారు. పరిశ్రమ వద్దని కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా, ఉపాధి అవకాశాలు కల్పించాలని మరికొందరు కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కాకినాడ ఈఈ సూర్యకళ, ఆర్డీవో మల్లిబాబు పాల్గొన్నారు.
కాలూష్య నియంత్రణ మండలి
ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ


