సామర్లకోట: ఇన్‌స్పైర్ మానక్ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు స్థానిక బొడ్డు భాస్కర రామారావు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని మట్టా యశ్విజ ఎంపికై ంది. పాఠశాల ఉపాధ్యాయుడు జీవీవీ సత్యనారాయణ శనివారం ఈ విషయం తెలిపారు. కేంద్ర విజ్ఞాన, సాంకేతిక శాఖ ఆధ్వర్యాన ఈ నెల 4న ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఇన్‌స్పైర్ మానక్ జిల్లా స్థాయి పోటీల ఫలితాలను జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ విడుదల చేశారు. జిల్లా స్థాయి పోటీల్లో 93 మంది విద్యార్థులు పాల్గొనగా 9 మంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. దీనిలో భాగంగా యశ్విజ రూపొందించిన ఆటోమెటిక్ సీవింగ్ మెషీన్ (జల్లెడ యంత్రం) ప్రదర్శన రాష్ట్ర స్థాయికి ఎంపికై ందని సత్యనారాయణ తెలిపారు. ఆయన సూచనలతోనే యశ్విజ ప్రతిభ చాటుకుందని పాఠశాల ప్రధానోపాధ్యాయిని లలిత మాణిక్యాంబ అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఎప్పుడు జరిగేదీ త్వరలోనే తెలియజేస్తామని జిల్లా సైన్స్ అధికారి కేసరి శ్రీనివాసరావు తెలిపారు. యశ్విజను హెచ్‌ఎం మాణిక్యాంబ, ఎంపీఓలు ఎన్.లక్ష్మీతులసి, పి.పుల్లయ్య, ఉపాధ్యాయులు అభినందించారు.
రేషన్ డీలర్ల సమస్యలు
పరిష్కరించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తమ సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన నాయకులు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. గత ఏడాది మోంథా తుపాను సమయంలో డీలర్లకు కేటాయించిన పంచదార, కందిపప్పు ఇంకా తమ వద్దనే ఉండిపోయాయని, వాటిని వెనక్కి తీసుకోవాలని కోరారు. కొన్ని మండలాల్లో తుపాను ప్రభావం లేకపోయినా అక్కడి డీలర్లకు ఇచ్చిన స్టాకు అలాగే ఉండిపోయిందని తెలిపారు. ఈ–పోస్ యంత్రాలకు గత ఆరు నెలలుగా పేపర్ రోల్స్ ఇవ్వడం లేదన్నారు. కొంత మంది డీలర్లను వారి మండలాల్లోని ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి కాకినాడ పాయింట్‌కు మార్చడంతో డీలర్లకు ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు.
కన్న తండ్రికి కన్నీటి వీడ్కోలు
అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తెలు
అయినవిల్లి: కని, పెంచి, పెద్ద చేసి.. అనారోగ్యంతో మంచం పట్టి.. తనువు చాలించిన తండ్రికి కుమార్తెలే అంత్యక్రియలు నిర్వహించి, కన్నీటి వీడ్కోలు పలికిన సంఘటన అయినవిల్లి మండలం కె.జగన్నాథపురంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పిచ్చిక సత్యనారాయణ (52)కు భార్య, ముగ్గురు కుమార్తెలు ప్రసన్న, జ్యోతిక, జ్యోత్స్న ఉన్నారు. క్యాటరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సత్యనారాయణ భార్య సరస్వతి మానసిక దివ్యాంగురాలు. ఏడాది క్రితం సత్యనారాయణకు పక్షవాతం రావడంతో పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, కుటుంబ భారం పెద్ద కుమార్తె ప్రసన్నపై పడింది. ఆమె ముమ్మిడివరంలోని ఐస్‌క్రీమ్ పార్లర్‌లో పని చేస్తూనే కుటుంబాన్ని పోషిస్తోంది. మిగిలిన ఇద్దరు కుమార్తెలు జ్యోతిక, జ్యోత్స్న కవలలు. వీరు అదే గ్రామంలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. ఈ పరిస్థితుల్లో సత్యనారాయణ శుక్రవారం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. సత్యనారాయణకు అక్క, తమ్ముడు ఉన్నారు. వారి కుటుంబాల్లో శుభకార్యాలు జరుగుతూండటంతో మృతి చెందిన సోదరుడి ఇంటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తండ్రి సత్యనారాయణ మృతదేహానికి కుమార్తెలు ప్రసన్న, జ్యోతిక, జ్యోత్స్నలు అంత్యక్రియలు నిర్వహించారు. వారి పరిస్థితిని చూసి, చలించిన గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. తల్లికి మతిస్థిమితం లేకపోవడం, తండ్రి మృతి చెందడంతో.. ఆ అక్కాచెల్లెళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.


