● సూపర్ సిక్స్ హామీలు,
సంక్షేమం అందించడంలో విఫలం
● హత్యా రాజకీయాలు,
కక్ష సాధింపుతో డైవర్షన్ పాలిటిక్స్
● చంద్రబాబుపై మాజీ మంత్రి
దాడిశెట్టి రాజా విమర్శలు
తొండంగి: సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా అప్పులు మాత్రమే సృష్టిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) కార్యక్రమంపై మండలంలోని పైడికొండ, అద్దరిపేట, వేమవరం, పి.అగ్రహారం గ్రామాల్లో బూత్ లెవెల్ ఏజెంట్ల(బీఎల్‌ఏ)తో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ఇష్టానుసారం అప్పులు చేస్తూ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేసి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే రూ.3.60 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి, సంపదకు బదులు అప్పులు సృష్టించారని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ హామీలు, సంక్షేమ పథకాల అమలులో విఫలమయ్యారన్నారు. వీటికి సమాధానం చెప్పలేక హత్యా రాజకీయాలు, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యల వంటి వాటిటో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు రావడంతో ద్రవ్యోల్పణం పెరిగిందని, కానీ, ఇంటింటికీ సంక్షేమం అందించినట్టు చంద్రబాబు సొంత మీడియా ద్వారా కొండంత ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. జూన్ 12న నిర్వహిస్తున్న శ్రీవెన్నుపోటుకు రెండేళ్లుశ్రీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఓట్లు తొలగించే కుట్రకు అవకాశం
కూటమి పాలనపై ప్రజలు రెండేళ్లకే విసుగు చెందారని, స్థానిక సంస్థలతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని రాజా అన్నారు. ప్రజల విశ్వాసం పొందని నేపథ్యంలో సర్ ప్రక్రియను అవకాశంగా తీసుకుని వైఎస్సార్ సీపీ అనుకూల ఓట్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేసే అవకాశం ఉందని అన్నారు. అందువలన సర్ కార్యక్రమం సందర్భంగా బూత్ లెవెల్ అధికారులతో పాటు బీఎల్‌ఏలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి, అర్హులైన ప్రజల ఓట్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకుని వస్తే ఎన్నికల కమిషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని రాజా చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మడదా హేమంత్, పార్టీ తొండంగి మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల బాబీ, పార్టీ మండల ఉపాధ్యక్షుడు మేడిశెట్టి దారబాబు, వేమవరం మాజీ సర్పంచ్ మారేటి కృష్ణ, అద్దరిపేట మాజీ సర్పంచ్ కోడా వర్మ, రైతు విభాగం మండల అధ్యక్షుడు గోసుల సత్యనారాయణ, నియోజకవర్గ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు మురాలశెట్టి సత్యనారాయణ, ఆర్‌టీఐ వింగ్ మండల అధ్యక్షుడు వీసం రామకృష్ణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ నేతలు
కూటమి పాలనపై విసుగుతో పైడికొండ పంచాయతీ ఆనూరు గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు రాజా సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఊటకోటి వరహాలు, ఊటకోటి రాజేష్ తదితరులకు రాజా పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, ఉపాధ్యక్షుడు మేడిశెట్టి దారబాబు, నాయకులు కాశిందేవుల శ్రీనివాస్, జక్కా వరహాలు తదితరులు పాల్గొన్నారు.


