సామర్లకోట: మండల పరిధి అచ్చంపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రా చోరీ జరిగింది. స్వామివారికి నివేదన అనంతరం అర్చకుడు కృష్ణమాచార్యులు ఇంటికి వెళ్లిపోయారు. మళ్లీ తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచేందుకు రాగా తెలుపులు తెరచి ఉన్నాయి. దీంతో స్వామివారి ఆభరణాలు పరిశీలించి చోరీ జరిగినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్రైమ్, వేలిముద్ర నిపుణులు ఆలయానికి చేరుకుని సమాచారం సేకరించారు. ఆలయ తాళాన్ని నకిలీ తాళంతో తెరిచినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు, ఈఓ ప్రతాప్‌కుమార్ ఆలయానికి చేరుకుని స్వామి, దేవేరులకు అలంకరించిన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు గుర్తించారు. మూడు కిలోల వెండి, మూడు కాసులు బంగారు ఆభరణాలు చోరీ జరిగిన్నట్లు అర్చకుడు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. ఆభరణాలకు బీమా చేయించినట్టు తెలిసింది. ఈఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలోని సీసీ కెమెరాతో ఫుటేజీ స్టోర్ అయ్యే హార్డ్‌డిస్క్ సైతం చోరీకి గురైనట్టు గుర్తించారు. దీంతో ఆలయానికి సంబంధించిన వారే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. గ్రామంలోని సెల్ షాపులో చోరీ జరిగి 24 గంటలు గడువక ముందే ఆలయంలో చోరీ జరగడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
రూ.13 లక్షల విలువైన సొత్తు అపహరణ


