కాకినాడ రూరల్: రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారడీలు నిరంతరం కొనసాగుతున్నాయని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయకుండా తాత్సారం చేస్తున్నారని చెప్పారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకే శాశ్వత రాజధాని తీర్మానం అంటూ మరోసారి అసెంబ్లీ నిర్వహించడాన్ని తప్పుబట్టారు. అసెంబ్లీలో చేసిన తీర్మానం మండలికి పంపించకుండా ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిని బట్టి చట్టసభలపై చంద్రబాబుకు ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందన్నారు. ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్కరికీ ప్లాట్లు ఇవ్వకపోవడంతో అక్కడి రైతులు తీవ్ర మనస్తాపంతో ఉన్నారని చెప్పారు. మంత్రి నారాయణ సమక్షంలో తన భూమిపై ప్రశ్నించిన రైతు రామారావు కుప్పకూలి మృతి చెందిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 2014–19 మధ్య సింగపూర్ సంస్థలకు నిర్మాణ కాంట్రాక్టుల పేరిట కాలయాపన చేసిన చంద్రబాబు.. తాత్కాలిక నిర్మాణాలను కూడా పూర్తి చేయలేకపోయారని నాగమణి విమర్శించారు. చంద్రబాబు గారడీలను నాడు కేంద్రంలో ఉన్న బీజేపి గ్రహించినందువల్లనే రాజధానికి సహకరించలేదని అన్నారు. అభివృధ్ధి వికేంద్రీరణ జరగాలని భావించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తీసుకువచ్చారని, తద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా కాకుండా చర్యలు చేపట్టారని అన్నారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కేవలం జగన్‌ను దూషించడానికే అన్నట్టుగా ఉందన్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు, అస్మదీయులకు కాంట్రాక్టులు అప్పగించి ప్రజాధనం దుర్వినియోగం చేసేందుకు ఇప్పటికే పావులు కదుపుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ అమరావతికి వ్యతిరేకం అని చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయడంతో పాటు, నిర్మాణ భారం ప్రజలపై పడకుండా చర్యలు చేపట్టాలన్నదే జగన్ ఆకాంక్ష అని నాగమణి స్పష్టం చేశారు.


