● దుఃఖసాగరంలో తిమ్మాపురం
● రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడి మృతి
● జీజీహెచ్ నుంచి ఊరేగింపు
కాకినాడ రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడి ప్రాణాల్ని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తిమ్మాపురానికి చెందిన సవరం బెన్నీ సుశాంత్ (14) వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి.. చివరకు ప్రాణాలు విడిచిపెట్టాడు. దీంతో, తల్లిదండ్రుల పుత్ర శోకానికి అంతే లేకుండా పోయింది. తిమ్మాపురం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసి ఈ సంఘటన వివరాలివీ.. పిఠాపురం – కాకినాడ రోడ్డులో తిమ్మాపురం సాయిబాబా గుడి ఎదురుగా ఈ నెల 22న జరిగిన రెండు బైక్‌లను కారు ఢీకొన్న ప్రమాదంలో మొత్తం ఏడుగురు గాయపడ్డారు. పిఠాపురం వైపు వస్తున్న కారు వేగంగా ఢీకొట్టడంతో తల్లిదండ్రులతో స్కూటీపై తిమ్మాపురం వస్తున్న సుశాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచీ నాగమల్లితోట జంక్షన్ వద్ద ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు శుక్రవారం మృతి చెందాడు. కాకినాడ జీజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం సుశాంత్ మృతదేహాన్ని శనివారం ఊరేగింపుగా తిమ్మాపురం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రమాదంలో బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు విజేత, అరుణ్ కుమార్‌తో పాటు గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. సుశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ డిమాండ్ చేశారు. సుశాంత్ మృతి బాధాకరమని, ఈ విషాదం నుంచి తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని సంతాపం వ్యక్తం చేశారు.


