బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): నగరంలోని ఆయుర్వేద ఆసుపత్రి పక్కనే కళాశాల కూడా నిర్మించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు డిమాండ్ చేశారు. చీడీలపొర గర్‌ల్స్ పాలిటెక్నిక్ ప్రాంగణం వద్ద ఉన్న ఆసుపత్రిని సీపీఐ నాయకులు శనివారం పరిశీలించారు. అనంతరం, ఆయుర్వేద వైద్య కళాశాలను ఇక్కడి నుంచి పిఠాపురానికి తరలించే ప్రయత్నాలను నిలిపివేయాలని కోరుతూ కలెక్టరేట్‌లో కలెక్టర్ షణ్మోహన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, గర్‌ల్స్ పాలిటెక్నిక్ ప్రాంగణానికి ఆనుకుని ఉన్న స్థలంలో సుమారు రూ.15 కోట్లతో 50 పడకల ఆయుర్వేద ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యి ఏడాది దాటిందన్నారు. దీనిని ఇప్పటికీ ప్రారంభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ నేషనల్ ఆయుష్ ఆధ్వర్యాన కేంద్ర ప్రభుత్వం రూ.45 కోట్లతో కళాశాల నిర్మాణానికి అనుమతి కూడా ఇచ్చిందన్నారు. విద్యా సంస్థల కోసం పిఠాపురం మహారాజా దానం చేసిన ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు బడాబాబులు ఆసుపత్రి నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రారంభం కాకుండా అడ్డుపుల్ల వేస్తున్నారని ఆరోపించారు. హోటల్ నిర్మాణానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఇక్కడే 3.5 ఎకరాలు ఇవ్వడం దారుణమని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. చుట్టు పక్కల మహిళా కళాశాల, మహిళా హాస్టల్, విద్యా సంస్థలు, ఇళ్లు ఉన్నచోట సామాన్యుడికి ఉపయోగం లేని హోటళ్లు ఏవిధంగా పెడతారని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల వ్యాపారాల కోసం కూటమి ప్రభుత్వం ఈ స్థలాన్ని లీజుకు కేటాయించిందన్నారు. నిజంగా పర్యాటకాభివృద్ధి కోసమే అయితే బీచ్ రోడ్డులోనో, ఏడీబీ రోడ్డులోనో హోటల్ పెట్టుకోవాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా ముందుకు వెళితే ఆ స్థలంలో నిరాహార దీక్షలు చేస్తామని మధు హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పద్మ, సహాయ కార్యదర్శి కేత అరుణ తదితరులు పాల్గొన్నారు.


