రత్నగిరిపై కన్నుల పండువగా.. | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై కన్నుల పండువగా..

Mar 28 2026 7:21 AM | Updated on Mar 28 2026 7:21 AM

అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడు వెలసిన రత్నగిరి క్షేత్రపాలకులైన శ్రీ సీతారాముల దివ్యకల్యాణ మహోత్సవం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో వైదిక కార్యక్రమాలకు పండితులు శ్రీకారం చుట్టారు. శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని తెల్లవారుజామున 4 గంటలకు సీతారాములకు పంచామృతాభిషేకం, అనంతరం శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. వధూవరులుగా అలంకృతులైన సీతారాములను వెండి ఆంజనేయ వాహనం పైన, పెళ్లి పెద్దలైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి పల్లకీ మీద ఉదయం 7 గంటలకు అన్నవరం గ్రామంలో ఊరేగించారు. అనంతరం ఊరేగింపుగా రత్నగిరి రామాలయం వద్ద ఉన్న వార్షిక కల్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. సర్వాంగసుందరంగా అలంకరించిన వేదిక మీద ప్రత్యేక సింహాసనంపై మంత్రోచ్చారణల నడుమ సీతారాములను, ఆ పక్కనే మరో ప్రత్యేక ఆసనంపై పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అమ్మవార్లను వేంచేయించారు.

కల్యాణ క్రతువు జరిగిందిలా..

ఉదయం 10.30 గంటలకు విఘ్నేశ్వర పూజతో కల్యాణ క్రతువు ప్రారంభించారు. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వి.త్రినాథరావు దంపతులు సీతారాములకు పట్టు వస్త్రాలు, మంచి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల వంశీకుల విశిష్టతను వివరిస్తూ.. ప్రవరను కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు చెప్పారు. అనంతరం, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, మహా సంకల్పం, యుగఛిద్రాభిషేకం, తదితర కార్యక్రమాలను పండితులు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిల్లగ్నంలో సీతారాముల శిరస్సులపై అర్చకులు జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం మాంగల్యసూత్ర ధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రామాలయంలోని సీతారాముల మూలవిరాట్‌లకు కూడా అర్చకులు తలంబ్రాలు పోశారు. నూతన దంపతులు సీతారాములకు పండితులు వేదాశీస్సులందజేశారు. సీతారాములకు నివేదించిన పానకం, వడపప్పును భక్తులకు పంపిణీ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగిన ఈ కల్యాణోత్సవాన్ని పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు, గ్రామస్తులు కన్నులారా తిలకించి, పులకించిపోయారు. కల్యాణోత్సవాన్ని దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, యనమండ్ర శర్మ, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, రామాలయం అర్చకుడు కోట వంశీ, అర్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, దత్తుశర్మ, సుధీర్‌, పవన్‌, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి తదితరులు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఏఈఓ కృష్ణారావు, సూపరింటెండెంట్‌ రమణ తదితరులు పర్యవేక్షించారు.

మధ్యాహ్నం సత్యదేవుని నిత్య కల్యాణం

సీతారాముల కల్యాణానంతరం అదే వేదికపై మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకూ సత్యదేవుని నిత్య కల్యాణం నిర్వహించారు. దీనిని ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకూ స్వామివారి నిత్యకల్యాణ మండపంలో నిర్వహిస్తారు. ఆ కల్యాణానికి సీతారాములు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. అయితే, శ్రీరామ నవమి సందర్భంగా సీతారామ కల్యాణానికి సత్యదేవుడు, అమ్మవారు పెళ్లి పెద్దలుగా వ్యవహరించడంతో సత్యదేవుని నిత్యకల్యాణం ఆలస్యంగా నిర్వహించారు. నవదంపతులైన సీతారాములు ఈ కల్యాణానికి పెళ్లి పెద్దలుగా వ్యవహరించడం విశేషం.

రమణీయంగా రాములోరి దివ్య కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement