● పాలన గాలికొదిలేసిన సర్కార్
● కూటమి పతనానికి రోజులు దగ్గర పడ్డాయి
● చంద్రబాబుపై అంబటి రాంబాబు ఫైర్
సాక్షి ప్రతినిధి, కాకినాడ/కిర్లంపూడి/కాకినాడ రూరల్: పరిపాలనను గాలికొదిలేసి వైఎస్సార్ సీపీ నేతలపై కక్ష సాధింపే అజెండాగా తండ్రీకొడుకులు రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పాలన అంటే వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులపై అక్రమంగా పోలీసులు కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం అనుకుంటున్నారని ఆక్షేపించారు. అప్రజాస్వామిక విధానాలు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వంపై రాష్ట్రంలో వ్యతిరేకత పెరిగిందని, చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం కూటమి కూలిపోతుందని చెప్పారు. కిర్లంపూడి, కాకినాడల్లో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం, మాజీ మంత్రి, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ వంగా గీత, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలను గురువారం అంబటి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ, తనను జైలుకు పంపడం అన్యాయమనే విషయం అందరికీ అర్థమైందన్నారు. తాను పొరపాటున నోరు జారిన కొద్ది వ్యవధిలోనే క్షమాపణ చెప్పానని, అయినప్పటికీ తన ఇంటిపై దాడి చేస్తే దగ్గరుండి పోలీసులు దాడికి సహకరించారని అన్నారు. లోకేష్ రాసిన రెడ్ బుక్‌కు తన కుక్క కూడా భయపడదు అన్నందుకా లేక సంక్రాంతి పోటీల్లో సరదాగా పాటలకు వేసిన స్టెప్‌ల కోసమే తనపై కక్ష కట్టారా అని రాంబాబు ప్రశ్నించారు. కూటమి కక్ష సాధింపులకు భయపడేది లేదన్నారు. అరాచకాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పోరాటం చేస్తానన్నారు. నీతికి, నిజాయితీకి ముద్రగడ పద్మనాభం మారు పేరని, అటుంటి నేత కుటుంబాన్ని చంద్రబాబు గతంలో చిత్రహింసలకు గురి చేశారని గుర్తు చేశారు. తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో తరువాత చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పతనమైందని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమవ్వడం ఖాయమని అన్నారు. తాను క్షణాల వ్యవధిలోనే క్షమాపణలు చెప్పినప్పటికీ తనపై దౌర్జన్యానికి ఒడిగట్టారని అంబటి అన్నారు. కుట్రలు, కుతంత్రాలకు చంద్రబాబు నిలయంగా నిలుస్తారని, తడిగుడ్డతో గొంతు కోసే నైజం ఆయన సొంతమని విమర్శించారు. 20 నిమిషాల పాటు తన ఇంటి ముందు టీడీపీ గూండాలు కరాళ నృత్యం చేశారన్నారు. పెట్రోల్ తెచ్చి ఇంటిని తగులబెట్టి, కార్లు పగులగొట్టిన వాడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి, తాను తిట్టానంటూ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపారని అన్నారు. తండ్రీకొడుకులు రాష్ట్రంలో అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగానికి తన కుక్క కూడా భయపడదన్నారు.
చిత్తశుద్ధి ఉంటే ఆ సీఐలను విచారించండి
చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తనను పోలీసు కస్టడీలో కొట్టిన ఇద్దరు సీఐలను సస్పెండ్ చేసి మెజిస్టేరియల్ విచారణకు ఆదేశించాలని అంబటి డిమాండ్ చేశారు. అలాగే తన ఇంటిని విధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుంటే తాను న్యాయస్థానం మెట్లు ఎక్కి తగిన గుణపాఠం చెబుతానని అంబటి హెచ్చరించారు. చంద్రబాబు, కొడుకు ఇక్కడ దోచిన సొమ్మును హైదరాబాద్‌లో దాచుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై ప్రాణాలకు తెగించి పోరాడతానని చెప్పారు.
కూటమి సర్కారుపై ప్రజా వ్యతిరేకత
గడచిన 19 నెలల కూటమి అరాచ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని అంబటి రాంబాబు అన్నారు. ఎక్కడ చూసినా ప్రజా వ్యతిరేకతే కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో 40 శాతం ఓటు బ్యాంకు కల్గిన వైఎస్సార్ సీపీ బలం మరింత పెరిగిందన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మరింత బలపడుతుందని, వైఎస్సార్ సీపీ 2029లో మళ్లీ అధికారంలోకి వస్తుందని అంబటి చెప్పారు.
న్యాయం జరిగే వరకూ పోరాడతా
గొప్ప రాజకీయ చరిత్ర, వ్యక్తిత్వం కలిగిన ముద్రగడ పద్మనాభం కాపు కులంలో పుట్టినందుకు ఆ సామాజిక వర్గీయులందరూ గర్వపడాలని అంబటి అన్నారు. అటువంటి నేత ఆశీర్వాదం తీసుకోవడానికే వచ్చానని చెప్పారు. ముద్రగద పద్మనాభం, తన అభిమానులు, కాపు కులస్తుల సహకారంతో తనకు న్యాయం జరిగే వరకూ కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. కిర్లంపూడిలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, భీమవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ చిన్నమిల్లి వెంకట్రాయుడు, నాయకులు యనమల కృష్ణుడు, గణేశుల బాబ్జీ, తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడలో ఘన స్వాగతం
కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్‌లోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన అంబటి రాంబాబుకు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యాన వైఎస్సార్ సీసీ రూరల్ నేతలు, కార్యకర్తలతో పాటు సిటీ నియోజకవర్గ నేతలు ఘన స్వాగతం పలికారు. వారందరినీ కన్నబాబు పరిచయం చేయగా, అంబటి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్‌చార్జి చిన్నమిల్లి వెంకట్రాయుడు, కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కౌడా) మాజీ చైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, మాల కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ పెదపాటి అమ్మాజీ, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీశివకుమారి, మాజీ మేయర్ సరోజ, సర్పంచ్ రామదేవు సూర్యప్రకాశరావు, మాజీ కార్పొరేటర్లు రాగిరెడ్డి బన్నీ, నల్లబిల్లి సుజాత, వడ్డి మణికుమార్, పార్టీ నేతలు కడియాల చిన్నా, ఈశ్వరరావు, ఇసుకపట్ల కుమారి, నల్లా రాణి, కరీం బాషా, సారా రాజేష్, మోకా కృష్ణంరాజు, పంతం ఇందిర తదితరులు పాల్గొన్నారు.


