దళిత క్రైస్తవులపై సుప్రీం తీర్పును పునఃపరిశీలించాలి | - | Sakshi
Sakshi News home page

దళిత క్రైస్తవులపై సుప్రీం తీర్పును పునఃపరిశీలించాలి

Mar 27 2026 9:17 AM | Updated on Mar 27 2026 9:17 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, సామాజిక హక్కుల వేదిక చైర్మన్‌ తాటిపాక మధు కోరారు. క్రైస్తవం స్వీకరించిన వారు ఎస్సీల కిందకు రారంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ సీపీఐ, సామాజిక హక్కుల వేదిక జిల్లా శాఖల ఆధ్వర్యాన స్థానిక గాంధీనగర్‌ పార్క్‌ నుంచి ప్రతాప్‌ నగర్‌ బ్రిడ్జి వరకూ గురువారం ర్యాలీ నిర్వహించారు. కొద్దిసేపు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, హిందూ, బౌద్ధ, సిక్కు మతాల వారు మినహా ఏ మతాల వారూ ఎస్సీల కిందకు రారంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం విచారకరమన్నారు. షెడ్యూల్డు కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించిందన్నారు. ఇది దళిత క్రిస్టియన్ల మనుగడకు గొడ్డలిపెట్టువంటిదన్నారు. మతం మారినంత మాత్రాన అంటరానితనం పోదనేది వాస్తవమన్నారు. పైగా బౌద్ధ, సిక్కు మతాల్లో చేరిన వారికి మాత్రం ఎస్సీ హోదా వర్తిస్తుందని, క్రిస్టియన్లకు మాత్రం ఆ హోదా పోతుందని చెప్పడం సరైంది కాదన్నారు. క్రమంగా రిజర్వేషన్లు ఎత్తివేయడానికి మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని ఒకవైపు న్యాయపోరాటం, మరోవైపు ఆందోళనలు నిర్వహిస్తామని మధు చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్‌, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క శ్రీనివాసరావు, ఏఐటీయూసీ నాయకులు ఎంఎస్‌ నారాయణ, ఎస్సీ సంఘాల నేతలు కొల్లబతుల రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement