బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 175 బంకులలో జిల్లా అవసరాలకు సరిపడా పెట్రోలు, డీజిల్ నిల్వలున్నాయన్నారు. అలాగే, 42 ఎల్‌పీజీ ఏజెన్సీల వద్ద వంట గ్యాస్ సిలిండర్లు సమృద్ధిగా ఉన్నాయన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలు, వదంతులను నమ్మవద్దని, అవసరం ఉన్నప్పుడే కొనుగోళ్లు, బుకింగ్‌లు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ సరఫరాల నిరంతర పర్యవేక్షకు జిల్లా స్థాయిలో పౌర సరఫరాలు, రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో కలిపి 88869 03611 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. మండల స్థాయిల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూములు పని చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియా వదంతుల కారణంగా వినియోగదారుల్లో కలిగిన ఆందోళన కారణంగా మాత్రమే రీఫిల్ బుకింగ్స్ తాత్కాలికంగా పెరిగాయన్నారు. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టీ స్టాళ్లలో వివిధ శాఖల అధికారులు తనిఖీలు చేస్తున్నారని, గత 12 రోజుల్లో వాణిజ్య వినియోగానికి ఉపయోగిస్తున్న 210 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని, 124 కేసులు నమోదు చేశారని వివరించారు. గత వారం జగ్గంపేట మండలంలో తాత్కాలికంగా ఆందోళనకర పరిస్థితి ఏర్పడగా, వెంటనే ఆయిల్ కంపెనీలను సమన్వయం చేసి, సరఫరా పెంచి, సమస్యను పరిష్కరించామని జేసీ భరత్ చెప్పారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్‌ఎస్‌ఎస్ సత్యనారాయణరాజు కూడా పాల్గొన్నారు.
పిల్లల జోలికెళితే ఉపేక్షించొద్దు
కాకినాడ క్రైం: దురుద్దేశాలతో పిల్లల జోలికెళ్లే నేరస్తుల్ని ఉపేక్షించవద్దని అధికారులకు ఎస్పీ బిందుమాధవ్ సూచించారు. కల్లాకపటం తెలియని బాలలపై నానాటికీ అకృత్యాలకు పెరుగుతూండటం ఆవేదన కలిగిస్తోందన్నారు. కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జరిగిన నేర సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. హత్యలు, మహిళలు, బాలలపై నేరాలు, ఆస్తి సంబంధిత నేరాలు, ఎన్‌డీపీఎస్ కేసులు, సైబర్ నేరాలు, పెండింగ్ కేసుల స్థితిగతులపై సమీక్షించారు. కేసుల దర్యాప్తు వేగవంతంగా చేపట్టి నిర్దిష్ట సమయానికి చార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా కొనసాగాలన్నారు. వివాదాస్పద రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. వాహన తనిఖీలు, నైట్ పెట్రోలింగ్, సీఏఎస్‌ఓ తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. సమీక్షలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు పాల్గొన్నారు.


