వధూవరులుగా సీతారాములు | - | Sakshi
Sakshi News home page

వధూవరులుగా సీతారాములు

Mar 27 2026 9:17 AM | Updated on Mar 27 2026 9:17 AM

అన్నవరం: రత్నగిరి రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు పెళ్లి పెద్దలుగా విచ్చేయగా.. రామాలయంలో సీతారాములను వధూవరులను చేసే కార్యక్రమం గురువారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. సాయంత్రం 4 గంటలకు సీతారాముల మూర్తులకు పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల ఘోష నడుమ వధూవరులగా అలంకరించారు. వధూవరులైన సీతారాములకు అన్నవరం దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వి.త్రినాథరావు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజల అనంతరం శుభం కోరుతూ ముత్తయిదువలు పసుపు దంచారు. ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, చిట్టి శివ, రామాలయం అర్చకుడు కోట వంశీ, పరిచారకుడు ముత్య వేంకట్రావు, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు తదితరులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.

నేడు కల్యాణోత్సవం

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు సీతారాములను వెండి ఆంజనేయ వాహనంపై, పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అమ్మవారిని పల్లకీపై గ్రామంలో ఊరేగిస్తారు. అనంతరం, రామాలయం పక్కనే ఉన్న సత్యదేవుని వార్షిక కల్యాణ వేదికపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సీతారాముల దివ్య కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్‌ ముహూర్తంలో మాంగల్యధారణ జరుగుతుంది. కల్యాణానంతరం భక్తులకు ప్రసాదం, వడపప్పు పానకం పంపిణీ చేస్తారు. రోజుకో వేడుకతో రత్నగిరిపై తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏప్రిల్‌ మూడో తేదీ రాత్రి 7 గంటలకు రామాలయంలో జరిగే సీతారాముల శ్రీపుష్పయాగ మహోత్సవంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement