అన్నవరం: వరుస వివాదాలు, పలుమార్లు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సిన ఉదంతాలతో గత ఏడాది సతమతమైన అన్నవరం దేవస్థానంలో పరిస్థితులు క్రమంగా కుదుట పడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడటంతో పాటు సత్యదేవుని దర్శనానికి వస్తున్న భక్తుల సంతృప్తి శాతంలో కూడా మెరుగుదల కనిపించింది. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో అందిస్తున్న సేవలపై ఐవీఆర్‌ఎస్, వాట్సాప్ ద్వారా భక్తుల అభిప్రాయాలు సేకరించి ఏడాది నుంచి ప్రభుత్వం ర్యాంకులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల అన్నవరం దేవస్థానం తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలవడం అధికారుల్లో ఆనందాన్ని నింపింది. ముఖ్యంగా స్వామివారి ఆదాయంలో వృద్ధి నమోదవుతోంది. హుండీల ద్వారా సత్యదేవునికి 2025–25 ఆర్థిక సంవత్సరంలో రూ.18,79,39,198 ఆదాయం వచ్చింది. 2025–26లో చివరిసారిగా హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించగా రూ.42,86,788 వచ్చింది. దీనిని కూడా కలిపితే ఈ ఆర్థిక సంవత్సరంలో హుండీల ద్వారా సత్యదేవునికి రూ.19,55,754,810 ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.76 లక్షలు అదనం. ఇందులో గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ నెల 26 వరకూ అంటే.. కేవలం నాలుగు నెలల్లోనే సుమారు రూ.6.50 కోట్లు రావడం విశేషం. గత డిసెంబర్ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకూ మూఢమి కారణంగా శుభకార్యాలు లేక భక్తుల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ హుండీ ఆదాయం పెరగడం విశేషం. ఇతర విభాగాల ద్వారా వచ్చే ఆదాయం కూడా ఈ ఏడాది భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి సుమారు రూ.20 కోట్ల పైగానే పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు.
హుండీల్లో దండిగా ఆదాయం
ఈ ఆర్థిక సంవత్సరంలో
రూ.19.55 కోట్లు
గత ఏడాది కంటే రూ.76 లక్షలు అధికం
సత్యదేవుని సన్నిధిలో
కుదుట పడుతున్న ఆర్థిక పరిస్థితి
సేవలకు, ఆదాయం పెంపునకు ప్రాధాన్యం
భక్తుల సంతృప్తికరమైన
సేవలు అందించడం ద్వారా ఏడు ప్రముఖ దేవస్థానాల్లో అన్నవరం ప్రథమ స్థానం పొందింది. ఈ స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా చర్యలు తీసుకుంటాం. అలాగే, దేవస్థానం హుండీల ఆదాయం కూడా గత ఏడా ది కన్నా రూ.76 లక్షలు అదనంగా వచ్చింది. అవసరమైన చోట్ల మరిన్ని హుండీలు పెట్టి, ఎక్కువ ఆదాయం వచ్చేలా చర్యలు చేపడతాం. అలాగే, భక్తులకు మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తాం.
– వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం


