శ్రీరామ వైభవం | - | Sakshi
Sakshi News home page

శ్రీరామ వైభవం

Mar 27 2026 9:17 AM | Updated on Mar 27 2026 9:17 AM

శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026

నేడు కోదండ రాముని

కల్యాణ వేడుక

ముస్తాబైన జి.మామిడాడ

పూర్తయిన ఏర్పాట్లు

పెదపూడి: మరో భద్రాద్రిగా పేరొందిన సుప్రసిద్ధ దివ్య క్షేత్రం జి.మామిడాడ కల్యాణోత్సవ శోభను సంతరించుకుంది. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా.. ఇక్కడ కొలువుదీరిన కోదండ రాముని కల్యాణోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణ క్రతువును కన్నులారా తిలకించి, తరించేందుకు వేలాదిగా భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో దీనికి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో కొలువుదీరిన కోదండ రాముని కల్యాణోత్సవాలు ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి దీటుగా జి.మామిడాడలోని ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి తూర్పు, పశ్చిమ దిశల్లో ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్టుగా అత్యంత ఎత్తున నిర్మించిన గోపురాలు భక్తులను ఎంతో ఆకట్టుకుంటాయి. వీటిపై భాగవత, రామాయణాల్లోని అపురూప ఘట్టాలను ప్రతిబింబించేలా రకరకాల శిల్పాలను ఎంతో మనోహరంగా తీర్చిదిద్దారు. తూర్పు గోపురం దాదాపు 160 నుంచి 170 అడుగులు, పశ్చిమ గోపురం సుమారు 200 అడుగుల ఎత్తున అనేక అంతస్తుల్లో నిర్మించారు. గోపురం చివరి అంతస్తు నుంచి చూస్తే దాదాపు 25 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, పచ్చని పొలాలు కనువిందు చేస్తాయి.

ఉత్సవం నిర్వహిస్తారిలా..

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా స్వామి వారిని తెల్లవారుజామున 3.30 గంటలకు మేల్కొల్పుతారు. ప్రాతఃకాల అర్చనానంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఉదయం సుమారు 11.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం ప్రారంభమవుతుంది. జానకి రాముల పరిణయానంతరం స్వామి వారి ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తారు.

రామ నామ తలంబ్రాలు

సీతారాముల కల్యాణోత్సవంలో ప్రధాన వేడుక తలంబ్రాలు. దీనికి మంచి ముత్యాలను సిద్ధం చేశారు. అలాగే, జి.మామిడాడ గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, ఫిజికల్‌ డైరెక్టర్‌ ద్వారంపూడి యువరాజారెడ్డి 16వ పర్యాయం శ్రీరామ నామ లిఖిత తలంబ్రాలను, కల్యాణ కొబ్బరి బొండాలను సిద్ధం చేశారు. 1,01,001 బియ్యపు గింజలపై ఎటువంటి సూక్ష్మ పరికరాలూ లేకుండా మార్కర్‌ సాయంతో తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో రామ నామాన్ని లిఖించి ఈ తలంబ్రాలను సిద్ధం చేశారు. అలాగే, రాములోరి కల్యాణంలో వినియోగించే కొబ్బరి బొండాలను కుటుంబ సభ్యుల సహకారంతో శంఖ, చక్ర, నామాలతో తీర్చిదిద్దారు. వీటిపై పెళ్లి కొడుకు రామయ్య, పెళ్లి కుమార్తె సీతమ్మ నామాలను లిఖించి కల్యాణోత్సవంలో అందజేయనున్నారు.

విస్తృతంగా ఏర్పాట్లు

సీతారాముల కల్యాణానికి జి.మామిడాడలో భారీ ఏర్పాట్లు చేశారు. వేలాదిగా భక్తులు తరలి రానున్నందున, స్వామివారి దర్శనానికి ప్రత్యేక క్యూలు, ఇతర ఏర్పాట్లు చేశారు. సుమారు 106 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎస్సై ఎస్‌.తులసీరామ్‌ తెలిపారు. వీరిలో ముగ్గురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైలు, 20 మంది మహిళా పోలీసులు, మిగిలిన వారు ఇతర కానిస్టేబుళ్లు ఉన్నారని వివరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రాంతాల్లోనూ గట్టి నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement