అబుదాబీ: గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. శనివారం అబుదాబీ లక్ష్యంగా దూసుకొచ్చిన ఒక బాలిస్టిక్ క్షిపణిని యూఏఈ రక్షణ వ్యవస్థ గగనతలంలోనే కూల్చివేసింది. అయితే ఈ క్రమంలో క్షిపణి శకలాలు కింద పడటంతో ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. అబుదాబీ మీడియా కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖలీఫా ఎకనామిక్ జోన్స్ అబుదాబీ పారిశ్రామిక ప్రాంతం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గగనతలంలో క్షిపణిని అడ్డుకున్న తర్వాత, దాని శకలాలు పారిశ్రామిక జోన్‌పై పడ్డాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురు భారతీయులకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.
రంగంలోకి అత్యవసర బృందాలు
క్షిపణి శకలాలు పడటంతో పారిశ్రామిక ప్రాంతంలో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ బృందాలు మంటలను అదుపు చేస్తున్నాయి. అయితే ఈ క్షిపణి ఎక్కడి నుంచి ప్రయోగించారనే విషయాన్ని యూఏఈ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
వదంతులను నమ్మవద్దు
ఈ ఘటన నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురికావద్దని యూఏఈ అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అన్ వెరిఫైడ్ వార్తలను, ఊహాగానాలను నమ్మవద్దని.. కేవలం ప్రభుత్వం విడుదల చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, తాజా దాడితో ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇది కూడా చదవండి: అభ్యర్థుల లిస్టుతో ‘విజయ్’ పొలిటికల్ సునామీ!


