ఫ వైభవంగా కోదండ రాముని
పరిణయ వేడుక
ఫ గొల్లల మామిడాడకు
వెల్లువెత్తిన భక్తజనం
పెదపూడి: వేద పండితుల సుస్వర మంత్రోచ్చారణలు.. మార్మోగుతున్న మంగళవాయిద్యాల ఘోష.. భక్తుల ‘జై శ్రీరామ్’ నినాదాల నడుమ.. పంచభూతాలు సాక్షిగా.. ఆకాశమంత పందిరిలో.. భూదేవంత పీటపై.. కోదండ రాముని కల్యాణం కమనీయంగా, కన్నుల పండువగా జరిగింది. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో శుక్రవారం జరిగిన కోదండ రాముని కల్యాణోత్సవాన్ని.. వేలాదిగా వచ్చిన భక్తులు కన్నులారా తిలకించి పులకించిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయ సమీపంలోని కోనేటికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఉదయం ఆరు గంటల నుంచే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. వెల్లువలా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.
వేడుక నిర్వహణ ఇలా..
ఉదయం 11.30 గంటలకు స్వామి, అమ్మవార్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పండితులు కల్యాణ సంకల్పం ప్రారంభించారు. మధ్యాహ్నం 12.45 గంటలకు విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. సంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు స్వామి, అమ్మవార్ల కరకమలాలకు రక్షబంధనం గావించారు. యజ్ఞోపవీత ధారణ అనంతరం, వధూవరులను సుగంధభరిత పుష్పమాలికలతో అలంకరించారు. మిథిలాధిపతి జనక మహారాజు తరఫున అర్చక స్వామివారు మధ్యాహ్నం 2.05 గంటలకు సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రునికి ఇచ్చి కన్యాదానం చేశారు. మధ్యాహ్నం 2.20 గంటల సుముహూర్తంలో కల్యాణమూర్తుల శిరస్సులపై అర్చకులు జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, హారతి ఇచ్చారు. వరుడు కోదండ రాముని తరఫున అర్చకుడు మధ్యాహ్నం 2.45 గంటలకు సీతమ్మవారికి మాంగల్యసూత్రధారణ గావించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలు పోసి, కల్యాణ క్రతువును మంగళప్రదంగా పూర్తి చేశారు.
తలంబ్రాలు, పట్టువస్త్రాలు
అంతకు ముందు వధూవరులైన సీతారాములకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గం కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు కూడా నూతన వస్త్రాలు సమర్పించి, స్వామి వారిని దర్శించుకున్నారు. అమ్మిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ద్వారంపూడి వెంకటరెడ్డి, పలువురు భక్తులు సైతం స్వామివారికి తలంబ్రాలుగా మంచి ముత్యాలు సమర్పించారు. ఉదయం 11.45 గంటలకు ఆలయ ధర్మకర్త ఇంటి నుంచి మంచి ముత్యాలు, తలంబ్రాలు, తొమ్మిది రకాల పండ్లు, పుష్పాలు, పట్టు వస్త్రాలను పల్లకీలో ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, భువన దంపతులు కూడా స్వామివారిని దర్శించుకుని, కల్యాణోత్సవాన్ని తిలకించారు. కోదండ రాముని కల్యాణోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే పిల్లల వేలంపాట తంతు ఆనవాయితీగా జరిగింది. కల్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ముత్యాల తలంబ్రాలు, అక్షతలు పంపిణీ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్థానిక ఎస్సై ఎస్.తులసీరామ్‌తో పాటు ముగ్గురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైల పర్యవేక్షణలో 106 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


