సీతారాములకు ఘనంగా
అరుంధతీ నక్షత్ర దర్శనం
అన్నవరం: శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా నవ దంపతులు సీతారాములకు పండితులు శుక్రవారం రాత్రి అరుంధతీ నక్షత్ర దర్శనం చేశారు. రాత్రి ఏడు గంటలకు వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ సీతారాములను ఊరేగింపుగా రామాలయం వెలుపలకు తీసుకువచ్చారు. అక్కడ పూజలు చేసిన అనంతరం, ఆకాశంలో అరుంధతీ నక్షత్రం వైపు చూపించారు. అనంతరం ఆలయానికి తీసుకువెళ్లారు. శనివారం ఉదయం స్థాలీపాక హోమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వేద పండితుడు గొల్లపల్లి ఘనపాఠి, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, రామాలయ అర్చకుడు కోట వంశీ, పురోహితుడు పాలంకి పట్టాభి, పరిచారకుడు ముత్య వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
తొలి తిరుపతికి
పోటెత్తిన భక్తులు
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో కొలువై యున్న శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు వివిధ గ్రామాల నుంచి రావడంతో ఆలయం రద్దీగా మారింది. స్వామివారికి ఇచ్చిన తొలి హారతిని తిలకించడానికి భక్తులు పోటీ పడ్డారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,66,160, అన్నదాన విరాళాలు రూ.61,218, కేశఖండన ద్వారా రూ.6,920, తులాభారానికి రూ.450, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.14,955 కలిపి మొత్తం రూ.2,49,703 ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. మూడు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారన్నారు. భక్తులకు గ్రామ సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్‌పర్సన్ మొయిలి సంధ్య, దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు సేవలందించారు.
అప్పనపల్లిలో భక్తుల రద్దీ
మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయానికి శనివారం భారీగా భక్తులు తరలివచ్చారు. సుప్రభాత సేవ, తొలి హారతిని అర్చకులు ఘనంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈఓ ఎం.రాంబాబురెడ్డి మాట్లాడుతూ, ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,54,430 ఆదాయం వచ్చిందన్నారు. స్వామివారిని 6,200 మంది భక్తులు దర్శించుకున్నారని, 2,800 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు. నిత్యాన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1,01,437 విరాళాలుగా అందించారని తెలిపారు.


