మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026

Mar 24 2026 7:04 AM | Updated on Mar 24 2026 7:04 AM

లో

ఎప్పటికో ధాన్యోస్మి!

పిఠాపురం: అరచేతిలో స్వర్గం చూపించడం అలవాటైన ప్రభుత్వం అన్నదాతలను అవస్థలకు గురి చేస్తోంది. పుణ్యకాలం పూర్తయ్యాక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం అలవాటుగా మార్చేసింది. ధాన్యం అందుబాటులోకి వచ్చే సరికి సిద్ధంగా ఉండాల్సిన కొనుగోలు కేంద్రాలు సగం అమ్మకాలు పూర్తయ్యే వరకు ప్రారంభించకపోవడం అన్నదాతలను అష్టకష్టాల పాలు చేస్తోంది. కేవలం ప్రైవేటు వ్యాపారులకు మేలు చేయడానికే అన్నట్టుగా ఉంది అధికారుల తీరు. జిల్లాలో ఇప్పటికే రబీ ఽవరి కోతలు ప్రారంభమయ్యాయి. మరో పది రోజుల్లో కోతలు ముమ్మరం కానున్నాయి. కానీ ఎక్కడా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. తద్వారా తక్కువ ధరకు అమ్ముకుని ఆర్థికంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల ప్రకటనలపై రైతుల విమర్శలు

ఈ ఏడాది రబీ సీజన్లో 227 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 1.87 లక్షల ఎకరాల్లో రైతులు ఈసారి రబీ సాగు చేపట్టారు. దాదాపుగా 6.76 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. గడచిన ఖరీఫ్‌లో 3.02 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. అయితే ఈ రబీకి 2,101 వాహనాలను, సుమారు 40 లక్షల గోనె సంచులు, 3,400 మంది హమాలీలు, 259 తేమ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నామని, 990 మంది సిబ్బందిని నియమిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఒకపక్క జిల్లాలో మెట్ట ప్రాంతమైన గండేపల్లి మండలంలో ఇప్పటికే రబీ వరి కోతలు ప్రారంభం కాగా మిగిలిన ప్రాంతాల్లో రబీ పంట కోతలకు సిద్ధమవుతోంది. అయినా ఇంకా అధికారులు ప్రణాళికలు, ఏర్పాట్లు అంటూ ప్రకటనలు చేయడంపై రైతుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

నిబంధనలతో అవస్థలు

ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకోవాలంటే రైతులు ఏటా అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం విధిస్తున్న సవాలక్ష నిబంధనలతో కేంద్రాల వలన ఉపయోగం లేకుండా పోతోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో పలుచోట్ల దళారులకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మద్దతు ధర కంటే తక్కువకే అమ్ముకోవడం వలన గిట్టుబాటు ధరను కోల్పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అక్కరకు రాకుండా పోతున్నాయనే విమర్శలు పలువురి రైతుల నుంచి తరచూ వినిపిస్తున్నాయి. తేమ శాతం తదితర అనేక నిబంధనలు విధించడంతో ఈ కేంద్రాల్లో అమ్ముకోలేక అనేకమంది దళారులనే ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. 24 గంటల లోపే ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామంటూ చెబుతున్నారు. కానీ ఎక్కువ మంది రైతులకు సకాలంలో సొమ్ము జమ కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మద్దతు ధర దక్కకుండా దళారులు రైతులను మభ్య పెడుతున్నారు. మరోవైపు వాతావరణం భయపెడుతోంది. ప్రకృతి విపత్తుల నడుమ, కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల వల్ల దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

8

దళారుల దోపిడీ

ఇప్పటివరకు జిల్లాలో సుమారు 600 ఎకరాలలో కోతలు పూర్తయినట్టు అధికార లెక్కలు చెబుతున్నాయి. యంత్రాల ద్వారా కోసిన ధాన్యాన్ని వెనువెంటనే ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తుండడం వలన రైతులు వారికే మద్దతు ధర కంటే తక్కువకు అమ్మకాలు సాగిస్తున్నారు. గత ఏడాది మద్దతు ధర ప్రకారం 75 కిలోలకు సాధారణ రకానికి రూ.1,725, ఏ గ్రేడ్‌ రకానికి రూ.1,740లు రైతుకు అందాల్సి ఉంది. కానీ ప్రస్తుతం గండేపల్లి మండలంలో పచ్చి ధాన్యాన్ని 75 కిలోలు రూ.1,600 నుంచి రూ.1,650 మధ్యలో ప్రైవేటు వ్యాపారులకు విక్రయాలు జరుపుతున్నామని అక్కడి రైతులు చెబుతున్నారు. గత ఏడాది ప్రభుత్వం సాధారణ రకం క్వింటాకు రూ.2,300, ఏ గ్రేడ్‌ రకానికి రూ 2,320 మద్దతు ధరగా ప్రకటించింది. కానీ ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి వారు చెప్పిన ధరకే అన్నట్లుగా దోచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వలన రంగు మారడంతో గతేడాది పలువురు 75 కిలోలు రూ.1,400కే అమ్ముకోవాల్సి వచ్చింది. ఒక్కో బస్తాపై రూ 340 నష్టపోవాల్సి వచ్చింది. మరోవైపు కేంద్రాల్లో సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలా ఈసారి అటువంటి సమస్యలు లేకుండా కొనుగోళ్లను ప్రారంభించాలని పలువురు రైతులు కోరుతున్నారు.

రబీ కోతలు ప్రారంభం..

తెరచుకోని కొనుగోలు కేంద్రాలు

ధాన్యం సేకరణకు

ఇంకా ప్రణాళికలలోనే యంత్రాంగం

ప్రైవేటు వ్యాపారులదే హవా

రైతుల ఆందోళన

ఎప్పుడూ ఆలస్యమే..

గత ఏడాది ఖరీఫ్‌, రబీ ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్లలోనూ ఇదే తంతు నడిచింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అంటూ ప్రకటనలు ఇవ్వడం తప్ప కోతలు ప్రారంభమయ్యే నాటికి మాత్రం ఏర్పాటు చేయడం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ ప్రారంభించే నాటికి సగం ధాన్యం అమ్మకాలు పూర్తయిపోతుంటాయి. జిల్లాలో సుమారు 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే ప్రభుత్వం కేవలం 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించింది. అంటే పండిన ధాన్యంలో సగం ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేసినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రబీ సీజన్లో కూడా అదే పరిస్థితి నెలకొననుందని రైతులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement