మంత్రి నారాయణకు సీపీఐ వినతి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తాజ్ హోటల్ పేరుతో కాకినాడలో ప్రభుత్వ స్థలం కాజేస్తున్నారని వెంటనే జీవో నంబర్ 17 రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణకు కలెక్టరేట్‌లో సోమవారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ టూరిజం శాఖ ఇంత దిగజారి రాజకీయాలు చేస్తుందని అనుకోలేదని మధు పేర్కొన్నారు. అసలు తాజ్ హోటల్ నిర్మాణమే ఇక్కడ లేదని, ఇప్పటివరకు తాజ్ హోటల్ ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదని, ఇదంతా టూరిజం ఆడుతున్న నాటకమన్నారు. కోట్లాది రూపాయల విలువైన ఇన్ని ఎకరాలు భూమిని రాజకీయ స్వప్రయోజనం కోసం కేటాయించి ప్రభుత్వ రాయితీలు ఇవ్వడం మరీ ఘోరమన్నారు. టూరిజం శాఖ విడుదల చేసిన జీవో నంబర్ 17 రద్దయ్య వరకు సీపీఐ పోరాటం ఆగదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్యను తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళామని మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు తోకల ప్రసాద్, కేశవరపు అప్పలరాజు పాల్గొన్నారు.
న్యాయసేవలు
వినియోగించుకోండి
కాకినాడ లీగల్: ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలను రిమాండ్ ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ (సీనియర్ సివిల్ జడ్జి) ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె కాకినాడ స్పెషల్ సబ్‌జైలును సందర్శించారు. వంటశాల, మహిళా ఖైదీల బ్యారక్, ఫిర్యాదుల పెట్టె, రికార్డులను పరిశీలించారు. రిమాండ్ ఖైదీలతో మాట్లాడి వారి ఆర్యోగ పరిస్థిఽతులు, వసతులు, భోజనం ఎలా ఉంది, ఎన్ని రోజుల నుంచి జైలులో ఉన్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న లీగల్ ఎయిడ్స్, సేవలపై అడిగి తెలుసుకున్నారు. అయితే ముగ్గురు నిందితులు మాట్లాడుతూ మాకు కేసులో రెండు షూరిటీలతో బెయిల్ అనుమతి వచ్చిందని, రెండు షూరిటీలు పెట్టుకునే స్థామత లేదని ఒక్క షూరిటీకి అనుమతి ఇప్పించాలని అడిగారు. ఈ కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్ ఎం.వీరబాబు, సబ్‌జైలు డిప్యూటీ జైలర్ జోసఫ్, న్యాయవాదులు పాల్గొన్నారు.


