ప్రముఖ సినీ నేపథ్య గాయని సుశీల
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడతో నాకు ఎంతో అనుబంధం ఉందని ప్రముఖ సినీ నేపథ్య గాయని పి.సుశీల అన్నారు. సత్కళావాహిని సంస్థ 55 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెను సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుశీల మాట్లాడుతూ 92 సంవత్సరాలు వయసులో తాను కాకినాడపై అభిమానం, సత్కళావాహిని సంస్థతో ఉన్న అనుబంధంతో మూడవసారి ఇక్కడకు వచ్చానన్నారు. కళల కాణాచి కాకినాడలో అభిమానుల ప్రేమకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. 55 సంవత్సరాలుగా సత్కళావాహిని సంస్థ సంగీతానికి చేస్తున్న సేవ అభినందనీయమన్నారు. సత్కళావాహిని వ్యవస్థాపకులు ఈవీ కృష్ణమాచార్యులు పి.సుశీలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సుశీలతో పాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం, ఎస్పీ శైలజ, పీబీ శ్రీనివాసు, బాలమురళీకృష్ణ వంటి దిగ్గజ గాయనీ గాయకులు, సంగీత విద్వాంసులు సత్కళావాహినిలో కార్యక్రమాలు నిర్వహించడం తమకెంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో సత్కళావాహిని అధ్యక్షుడు గోపాల నర్సరాజు, జేఎన్టీయూకే వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్, ఓఎన్‌జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాల్సేన్ గుప్తా, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మేయర్ సుంకర పావని గాయని సుశీలను సత్కరించారు.
వాట్సాప్ గవర్నెన్స్‌పై
అవగాహన పెంచాలి
– మంత్రి నారాయణ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వాట్సాప్ గవర్నెన్స్ సేవల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. జిల్లా సమీక్ష కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జరిగింది. శాఖల వారీగా మంత్రి అధికారులతో సమీక్షించి లక్ష్యాల సాధనకు కార్యాచరణ సూచించారు. అనంతరం మీడియా సమావేశంలో వివిధ అంశాలను వివరించారు. జిల్లాలో పంటలకు నీటి అవసరం పూర్తయినందున నీటి విడుదల ముందే ఆపి, నిర్వహణ పనులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించామని తెలిపారు. జిల్లాలో పట్టణ ఆవాసాల్లో 1,70,523 కుటుంబాలు ఉండగా ఇప్పటికి 28,223 కుటుంబాలు మాత్రమే వాట్సాప్ గవర్నెన్స్ వినియోగిస్తున్నాయని మిగిలిన వారికి అవగాహన పెంపొందించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నామని, జిల్లాలో 19,593 కుటుంబాలు ఉండగా ఇప్పటికి 524 మంది ఈ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారని, మిగిలినవారు లబ్ధి పొందేలా చూడాలని ఆదేశించామన్నారు. కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీఆర్వో తిప్పేనాయక్ పాల్గొన్నారు.


