జాబ్‌ క్యాలెండర్‌తో దగా | - | Sakshi
Sakshi News home page

జాబ్‌ క్యాలెండర్‌తో దగా

Mar 24 2026 7:04 AM | Updated on Mar 24 2026 7:04 AM

కేవలం 10వేల పోస్టులతో భారీ ప్రచారం

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌

సాక్షి ప్రతినిధి, కాకినాడ: జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో యువత పట్ల నయ వంచనకు పాల్పడుతున్న చంద్రబాబు కుతంత్రాలపై ప్రజలు పోరుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్‌కుమార్‌ (బన్ని) పేర్కొన్నారు. సోమవారం కాకినాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 1.72 లక్షల పోస్టులు ఖాళీ ఉంటే కేవలం 10,060 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ జారీ చేసి నిరుద్యోగులకు.. ఉద్యోగ అవకాశాలు కల్పించామని ప్రచారం ఊదర కొట్టిందన్నారు. ఈ పోస్టులు కూడా నాలుగు విడతల్లో వచ్చే అక్టోబర్‌ వరకు భర్తీ చేయనున్నట్లు ప్రకటించి మరో మోసం చేసిందన్నారు. ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదేళ్ల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చింది. ఉద్యోగం ఇచ్చేంతవరకు నెలకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. గద్దెనెక్కిన 22 నెలల కాలంలో ఏ ఒక్క నిరుద్యోగికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరు చెప్పి తూతూ మంత్రంగా ఇటీవలే క్యాలెండర్‌ విడుదల చేశారని విమర్శించారు. ఆ క్యాలెండర్‌కు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు పొంతనలేకుండా ఉందన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయిమెంట్‌ జోన్‌ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అత్యధిక ఉద్యోగాల హామీ కల్పనగానే మిగిలిందన్నారు. ఎంఎస్‌ఎమ్‌ఈ సెక్టార్లకు ప్రోత్సాహం అందిస్తామంటూ మేనిఫెస్టోలో ప్రకటించి నిలువునా నిరుద్యోగులను దగా చేశారన్నారు. నిరుద్యోగం తాండవిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఇంకా లడ్డూ వివాదం మీదే పబ్బం గడుపుతోందన్నారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలు చేయడంలో చూపిస్తోన్న చొరవ ప్రజలకు గ్యాస్‌ కొరత తీర్చే విషయంలో చూపడం లేదన్నారు. హాస్టల్‌లో ఉండి చదువుకునే విద్యార్థులకు, బయట పీజీ హాస్టల్స్‌లో ఉండి చదువుకునేవారికి ప్రస్తుతం ఎక్కడా హోటల్స్‌ అందుబాటులో లేకపోవడంతో తిండిలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి విద్యార్థులు, నిరుద్యోగులకు, ప్రజలకు ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement