– వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి
కాకినాడ రూరల్: రాజకీయ ఉనికి కోసం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రత్యర్థుల చేతిలో కీలు బొమ్మ అవతారం ఎత్తారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలోని అంతర్గత వ్యవహారానికి సంబంధించిన లేఖ తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీడీపీలో ముందుగా ప్రత్యక్షమవడాన్ని చూస్తుంటే షర్మిల తన రాజకీయ అవసరాల కోసం కుటుంబాన్ని బజారున పడేశారన్నది స్పష్టం అవుతోందన్నారు. రాజకీయాల్లో మాట తప్పని నైజం ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన బాటలో కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి పయనిస్తుంటే అదే కుటుంబం నుంచి వచ్చిన షర్మిల మాత్రం దిగజారుడు రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ కుటుంబానికి ఉన్న చరిష్మాను, పరువును షర్మిల మంటగలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత జగన్‌ను నేరుగా ఢీకొట్టలేని కూటమి ప్రభుత్వం మహిళలను అడ్డం పెట్టుకుని కుటుంబాల జోలికి వెళ్లడంపై నాగమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని భారతమ్మను లక్ష్యంగా చేసుకుని జనసేన మహిళా కార్యకర్త సుభాషిణి అసభ్య పదజాలంతో దూషించడం సరికాదన్నారు. సభ్యత సంస్కారం లేకుండా ఓ మాజీ ముఖ్యమంత్రి భార్యను దూషించినా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
దీన్ని బట్టీ కావాలనే పవన్ కళ్యాణ్ సదరు జనసేన వీర మహిళలతో అలా మాట్లాడించారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. మరోవైపు అంకెల గారడీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రాపకం కోసం సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపాదిత వ్యయానికి రాబడి మధ్య రూ.10, 500 కోట్ల వ్యత్యాసం ఉందని కాగ్ తన నివేదికల్లో స్పష్టం చేస్తున్నా బాబు గారి అంకెల గారడీ మాత్రం ఆగడం లేదన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు లేకుండా ఉపాధ్యాయుల నియామకాల చేపట్టి ఏం లాభమని ప్రశ్నించారు. అవసరాన్ని బట్టీ కాకుండా తమ జేబులు నింపుకునేందుకు ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టారా అన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.


