ఇవేం కల్తీ రాజకీయాలు? | - | Sakshi
Sakshi News home page

ఇవేం కల్తీ రాజకీయాలు?

Feb 18 2026 7:00 AM | Updated on Feb 18 2026 7:00 AM

ఇవేం కల్తీ రాజకీయాలు?

ఇవేం కల్తీ రాజకీయాలు?

పిఠాపురం: కల్తీ రాజకీయాలు చేస్తే సహించేది లేదని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌ కూటమి నేతలను హెచ్చరించారు. పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ సిట్‌ స్పష్టమైన నివేదిక ఇచ్చినప్పటికీ మళ్లీమళ్లీ దుష్ప్రచారాలు చేస్తూ వేంకటేశ్వరస్వామి వారిని, లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బ తీసేలా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉక్రోషం, ఆయనపై తప్పు దొరకలేదనే బాధతోనే సీబీఐ నివేదిక వచ్చిన తరువాత కూడా తప్పుడు ప్రచారం ఆపలేదని అన్నారు. దీనిని ప్రశ్నించిన వైఎస్సార్‌ సీపీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ ఇళ్లపై, విడదల రజనిపై దాడులు చేయడం పెట్రోలు, యాసిడ్‌ బాంబులు వేయడం వంటి దుశ్చర్యలకు ఒడిగట్టారని, ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లతో తప్పుడు ప్రచారాలకు దిగారని ధ్వజమెత్తారు.

ఇక్కడా అదే దుష్ప్రచారం

మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భగవంతుడు సాక్షిగా ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌ అదే దుష్ప్రచారానికి దిగడం దారుణమని గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. శివుని దర్శనానికి వచ్చిన లక్షలాది మంది భక్తులకు రాజకీయ దురుద్దేశంతో కరపత్రాలు పంపిణీ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యల వల్ల ఇప్పటికే ఘర్షణలు జరిగాయని, కొట్టిన వారు చక్కగా తిరుగుతూండగా బాధితులు మాత్రం జైలులో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నేతల కుట్రలకు ఇది పరాకాష్ట అని అన్నారు. అసలు ఆ కరపత్రం ఎవరు ముద్రించారో దమ్ముంటే చెప్పాలని ప్రశ్నించారు. వేంకటేశ్వరస్వామిపై, లడ్డూ ప్రసాదంపై, జగన్‌పై వ్యంగ్యంగా కరపత్రం ముద్రించడమేమిటని మండిపడ్డారు.

తప్పు కప్పిపుచ్చుకోవడానికే బురదజల్లుడు

వేంకటేశ్వరస్వామి వారిని అభాసుపాలు చేయాలని చూశారని, అక్కడితో ఆగకుండా కుక్కుటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజార్చడానికి పూనుకున్నారని గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారంతో పాదగయ వద్ద కరపత్రాలు పంచారని, వీటిని భక్తులు తిప్పికొట్టారని, భగవంతుడితో ఆటలాడితే భక్తుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆలయాల వద్ద మత రాజకీయాలు చేస్తారా అని నిలదీశారు. దొంగే దొంగా అని అరచినట్టు.. వారే తప్పులు చేసి దానిని కప్పి పుచ్చుకోవడానికి ఎదుటి వారిపై బురద జల్లుతున్నారని అన్నారు. చేసిన తప్పునకు భక్తులకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. వైఎస్‌ జగన్‌పై ఇంకా కక్ష సాధించడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

అన్నీ తప్పుడు ప్రచారాలే..

అన్ని విషయాల్లోనూ కూటమి నేతలు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని గీత అన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కేవల రూ.3 లక్షల కోట్ల అప్పు చేస్తే రూ.14 లక్షల కోట్లంటూ దుష్ప్రచారం చేశారన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలపై కూడా ఇలాగే తప్పుడు ప్రచారం చేశారని, విజయవాడ ప్రకాశం బ్యారేజీని పడవతో ఢీకొట్టించారన్నారని.. ఇలా రోజుకో అబద్ధం ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్ర బడ్జెట్‌లో సూపర్‌ సిక్స్‌ పథకాలకు పంగనామం పెట్టారని అన్నారు.

పరిపాలనంటే

దాడులు, అక్రమ కేసులా?

పరిపాలన అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు పాల్పడి, అక్రమ కేసులు పెట్టడమేనా అని గీత ప్రశ్నించారు. ఎన్ని దుష్ప్రచారాలు, దాడులు చేసినా, కేసులు పెట్టినా తమ నాయకుడు జగన్‌ను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. అసెంబ్లీకి రారు 11 మంది అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, ఆ 11 మందికే మీరంతా భయపడి పల్టీలు కొడుతున్నారని దుయ్యబట్టారు. ధైర్యం ఉంటే ఆ 11 మందికి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి అంటూ కూటమి నేతలకు సవాల్‌ విసిరారు. ప్రెస్‌ మీట్‌లో జగన్‌ లేవనెత్తిన అంశాలకు ఒక్క మంత్రి కూడా సమాధానం చెప్పలేని, చేతకాని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. బడ్జెట్‌ గురించి బుగ్గన రాజేంద్రనాథ్‌ అడిగిన ప్రశ్నలకు ఒక్కరూ సమాధానం చెప్పలేకపోయారన్నారు. ఉన్నత పదవులు నిర్వహించిన తమ నేత బొత్స సత్యనారాయణపై అవాకులు చవాకులు పేలితే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రసాదంపై తప్పుడు ప్రచారాన్ని ఇకనైనా ఆపాలని, కుక్కుటేశ్వరస్వామిపై భక్తితో ఆగాం తప్ప చేతకాక ఊరుకోలేదని స్పష్టం చేశారు. భక్తి వాతావరణాన్ని దెబ్బ తీయడం ఇష్టం లేకనే తప్పుడు కరపత్రాలపై ప్రతిచర్యకు దిగలేదన్నారు. ఉత్సవాలు పూర్తయ్యాయి కాబట్టి దీనిని ఇప్పుడు ఖండిస్తున్నామన్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించబట్టే తప్పుడు ప్రచారాలు చేయగలిగారని, అదే తాము ప్రతిచర్యకు దిగితే పరిస్థితి మరోలా ఉండేదని కూటమి నేతలను గీత హెచ్చరించారు.

ఫ వీటిని సహించేది లేదు

ఫ వైఎస్సార్‌ సీపీ నేత వంగా గీత

ఫ కూటమి నేతల తీరుపై ఆగ్రహం

‘సుప్రీం’ చెప్పినా లెక్క లేదా?

ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా ఎవ్వరూ ఎటువంటి స్టేట్‌మెంట్లూ ఇవ్వరాదంటూ స్వయంగా సుప్రీంకోర్టే చెప్పినా కూటమి నేతలకు లెక్క లేకుండా ఉందని గీత దుయ్యబట్టారు. ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సైతం ఉచ్చం నీచం మరచి, పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఇంకా చెప్పడానికి వీలు కాని వాటిని కలిపారంటూ చెప్పడం వారి దిగజారుడుతనానికి నిరద్శనమని అన్నారు. అటువంటివేవీ లేవని సీబీఐ నివేదిక ఇచ్చినా కూడా దుష్ప్రచారాలకు ఒడిగడుతున్నారని, దైవ ప్రసాదాన్ని వీధుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎటువంటి ఆధారాలూ లేకుండా లడ్డూ ప్రసాదంపై కల్తీ ఆరోపణలు చేసిన కూటమి నాయకులు వెంటనే ప్రజలకు, కోట్లాది మంది భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వచ్చిన నివేదిక ప్రకారం ఏదైనా తేడా ఉంటే దాని ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అంతే కానీ ఇలా దిగజారి దేవుడిని వీధుల్లోకి లాగవద్దని ఆమె హితవు పలికారు. మరోసారి ఇటువంటి కరపత్రాలు వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement