భవిష్యత్‌ కమ్యూనిజానిదే.. | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ కమ్యూనిజానిదే..

Feb 18 2026 7:00 AM | Updated on Feb 18 2026 7:00 AM

భవిష్యత్‌ కమ్యూనిజానిదే..

భవిష్యత్‌ కమ్యూనిజానిదే..

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): సీపీఐ వంద సంవత్సరాల పోరాట చరిత్రను ప్రజలు గమనిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఖమ్మంలో జరిగిన పార్టీ శతవార్షికోత్సవాల ముగింపు సభకు లక్షలాది మంది తరలి వచ్చారని, ఆ తరువాత కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ జెండా ఎగిరిందని చెప్పారు. భవిష్యత్‌ అంతా కమ్యూనిజానిదేనన్నారు. స్థానిక సూర్యరాయ కల్యాణ మండపంలో సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఖమ్మంలో జరిగిన శతవార్షికోత్సవాల సభకు దేశం నలుమూలల నుంచీ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, విద్యార్థులు, మహిళలు, రైతు లు, కార్మికులు భారీగా తరలివచ్చి, కమ్యూనిస్టు ఉద్యమానికి మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు.

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, దేశంలో భూస్వామ్య దోపిడీకి, సామ్రాజ్యవాదానికి, కుల వివక్షకు, మత విద్వేషానికి వ్యతిరేకంగా జరిగిన అనేక పోరాటాలకు కమ్యూనిస్టు ఉద్యమం నాయకత్వం వహించిందని అన్నారు. భూమి కోసం, పని కోసం, రొట్టె కోసం, హక్కుల కోసం జరిగిన ప్రతి కీలక పోరాటంలో సీపీఐ ముందు వరుసలో నిలిచిందన్నారు. దళితులు, పేదలు, మైనారిటీలు, గిరిజనులు, మహిళలు, కార్మిక వర్గాలకు సామాజిక న్యాయం సాధించడమే లక్ష్యంగా నిరంతరం పని చేసిందని వివరించారు. శతవార్షికోత్సవాల సందర్భంగా పోరాట వారసత్వాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, ప్రజల సమస్యలపై ఉద్యమాలను ఉధృతం చేయాలని ప్రతిజ్ఞ చేసిందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటం, భారత రాజ్యాంగాన్ని రక్షించడం, దేశ లౌకిక సంప్రదాయాన్ని కొనసాగించడం నేడు అత్యవసరంగా మారాయని అన్నారు.

మతోన్మాదంతో సమైక్యతకు ముప్పు

మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నీరుగార్చి, నాలుగు లేబర్‌ కోడ్‌ల పేరుతో కార్మికుల హక్కులను కాలరాస్తోందని ముప్పాళ్ల విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేకుండా చేసి, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోకి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దేశ సంపదను కొద్దిమంది బడా కార్పొరేట్లకు దోచిపెట్టి, సామాన్యులపై పన్నుల భారం మోపుతోందని మండిపడ్డారు. దేశంలో పెరుగుతున్న మతోన్మాద రాజకీయాలు ప్రజల మధ్య విభజనకు దారి తీస్తున్నాయని, ఇది భారత ఐక్యతకు, సమైక్యతకు తీవ్రమైన ముప్పుగా మారిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రానున్న ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి దించాల్సిన అవసరముందని అన్నారు.

మెడికల్‌ మాఫియాపై చర్యలు తీసుకోవాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో మెడికల్‌ మాఫియాపై చర్యలు తీసుకునేంత వరకూ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయాలని, వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే డిమాండ్లతో ఈ ఉద్యమం నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీని రానున్న రోజుల్లో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి సభ్యుడూ వాడవాడలా అంకిత భావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీతో పాటు అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని, ఉద్యమాల్లో కార్మికులు, రైతులు, యువత, మహిళలు చురుగ్గా పాల్గొనేలా భాగస్వాములను చేయాలని అన్నారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా భావజాల పోరాటంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య, అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జేవీ సత్యనారాయణమూర్తి, పి.హరినాథ్‌రెడ్డి, జంగాల అజయ్‌ కుమార్‌, డి.జగదీష్‌, డేగ ప్రభాకర్‌, పి.దుర్గా భవాని జల్లి విల్సన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ సీపీఐ నేత రామకృష్ణ

ఫ పార్టీ రాష్ట్ర సమితి

సమావేశాలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement