ముద్రగడ రాజకీయ అనుభవం పార్టీకి అవసరం | - | Sakshi
Sakshi News home page

ముద్రగడ రాజకీయ అనుభవం పార్టీకి అవసరం

Feb 18 2026 7:00 AM | Updated on Feb 18 2026 7:00 AM

ముద్ర

ముద్రగడ రాజకీయ అనుభవం పార్టీకి అవసరం

కిర్లంపూడి: సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం రాజకీయ అనుభవం పార్టీకి ఎంతో అవసరమని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. ముద్రగడను కిర్లంపూడిలోని నివాసంలో మంగళవారం అమర్నాథ్‌తో పాటు పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, అక్కడి జెడ్పీ చైర్మన్‌, భీమిలి నియోజకవర్గం పరిశీలకుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్‌, అనకాపల్లి నియోజకవర్గ పరిశీలకుడు చిక్కాల రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. పలు రాజకీయ అంశాలపై పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ గిరిబాబుతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నీతి నిజాయతీలకు ముద్రగడ పద్మనాభం మారుపేరని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన సలహాలు, సూచనలు తీసుకుని పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పారు.

జిల్లా రిజిస్ట్రార్ల నియామకం

కాకినాడ లీగల్‌: రిజిస్ట్రేషన్ల శాఖలో కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లాల రిజిస్ట్రార్లుగా కె.ప్రసాదరావు, కె.జగన్‌మోహన్‌రావులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. లంచం తీసుకున్న కేసులో గత ఏడాది మార్చి 28న అప్పటి కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌గా కె.ఆనందరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచీ జిల్లా ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా జయలక్ష్మి విధులు నిర్వహిస్తున్నారు. ఆమె స్థానంలో కృష్ణా జిల్లా చల్లపల్లిలో సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న కె.ప్రసాదరావుకు పదోన్నతి కల్పిస్తూ కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌గా నియమించారు. అలాగే, రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్‌ రెడ్డి సత్యనారాయణను గత జనవరి 30న ఉద్యోగోన్నతిపై విజయవాడ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(డీఐజీ)గా నియమించారు. రాజమహేంద్రవరం జిల్లా ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా నాగలింగేశ్వరరావు నియమించారు. ఆయన స్థానంలో మచిలీపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌–1గా పని చేస్తున్న కె.జగన్‌మెహన్‌రావుకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్‌గా నియమించారు.

వీరేశ్వరస్వామి

జల విహారానికి ఏర్పాట్లు

ఐ.పోలవరం: మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15న ప్రారంభమైన మహా శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. రోజూ స్వామి వారి అభిషేకాలు, కుంకుమ పూజలు దర్శనాలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆఖరి రోజయిన 19వ తేదీన నిర్వహించే స్వామివారి జల విహారం ఏర్పాట్లను చైర్మన్‌ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్‌ కమిషనర్‌, కార్య నిర్వాహణాధికారి వి.సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. వృద్ధ గౌతమీ నదీపాయ వద్ద తెప్పోత్సవం జరిగే ప్రాంతాన్ని వారు పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పర్యవేక్షణ అధికారిని ఆదేశించారు. తొలుత ఆలయం నుంచి భారీ ఊరేగింపు, కేరళ వాయిద్యాలు, కోలాటాలు, శక్తి వేషాలు, గరగ నృత్యాలతో స్వామి వారిని, అమ్మవారిని రథంపై ఊరేగింపుగా వృద్ధ గౌతమి నది వద్దకు తీసుకువస్తారు. తరువాత గోదావరి మాతకు ప్రత్యేక పూజలు, పంచ హారతులు, అనంతరం హంస వాహనంపై జల విహార మహోత్సవం నిర్వహించనున్నారు.

డెల్టా వ్యవస్థ పరిశీలన

పి.గన్నవరం: గోదావరి డెల్టా వ్యవస్థ తీరుతెన్నులపై పరిశీలన చేస్తున్నట్టు గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ బీపీ పాండ్య, జీఆర్‌ఎంబీ మెంబర్‌ సెక్రటరీ కాంబోజీ తెలిపారు. ఇరిగేషన్‌ ఎస్‌ఈ గోపీనాథ్‌, ఈఈ కె.వెంకటేశ్వరరావులతో కలిసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వారు పర్యటించారు. పి.గన్నవరం పాత అక్విడెక్టును, వైనతేయ నదీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఇరిగేషన్‌ డీఈఈ భూపతిరాజు ప్రసాదరాజు, ఏఈ బి.రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ముద్రగడ రాజకీయ  అనుభవం పార్టీకి అవసరం 1
1/1

ముద్రగడ రాజకీయ అనుభవం పార్టీకి అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement