కార్యదర్శులకు పన్నుపోటు
గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం
● నూరు శాతం వసూలు చేయాలని ఒత్తిళ్లు
● లేకపోతే సస్పెన్షన్లు తప్పవని హెచ్చరికలు
● ఆందోళన చెందుతున్న కార్యదర్శులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గ్రామ పంచాయతీ కార్యదర్శులు ‘పన్ను’ పోటుతో సతమతమవుతున్నారు. అంటే పన్ను వారు చెల్లించాలని కాదు. ప్రజల నుంచి నూ రు శాతం పన్నులు వసూలు చేయాలంటూ కార్యదర్శు ల కుత్తుకలపై సర్కారు కత్తులు పెడుతోంది. ఈ నెలలోనే రెండు విడతల్లోగా నూరు శాతం పన్నులు వసూ లు చేయకపోతే కఠిన చర్యలు తప్పవంటూ అధికారు లు హెచ్చరిస్తున్నారు. ఈ నుంచి వస్తున్న హెచ్చరికలతో పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు.
తాము అధికారంలోకి వస్తే ప్రజలపై భారాలు మోపబోమంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు అండ్ కో గొప్పగా చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికే విద్యుత్ చార్జీలు అడ్డంగా పెంచేశారు. ఏడాదిన్నర కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. నెలవారీ పచారీ సరకుల కొనుగోలుకే బిల్లు నాలుగైదు వేల రూపాయలు దాటిపోతోంది. ఈ పరిస్థితుల్లో అధిక శాతం ప్రజలు పన్నుల చెల్లింపునకు ముందుకు రావడం లేదు. సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే గ్రామ పంచాయతీల్లో ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాల్సిందేనని కార్యదర్శులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. దీంతో, జిల్లాలోని గ్రామ పంచాయతీల కార్యదర్శులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఓవైపు పల్లె ప్రజలపై పన్నుల భారం మోపుతూ.. మరోవైపు అది వసూలు కాకపోతే కార్యదర్శులను బలి చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. లక్ష్యం మేరకు పన్నులు వసూలు చేయకుంటే ఇంటికి సాగనంపేందుకు కూడా వెనుకాడేది ప్రభుత్వం హెచ్చరించింది. ఈ ఒత్తిళ్లు భరించలేక ఈ రెండు నెలలూ సెలవు పెట్టేసి వెళ్లిపోవడమే శ్రేయస్కరమని పలువురు కార్యదర్శులు అభిప్రాయపడుతున్నారు.
వసూలు లక్ష్యాలు ఇలా..
జిల్లాలోని 295 గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాది రూ.86.21 కోట్ల మేర పన్నులు వసూలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనిని ఇంటి పన్ను, నీటి పన్ను, నాన్ ట్యాక్స్ ఇండస్ట్రీస్ నుంచి వసూలు చేయాల్సి ఉంది. తొలి విడతగా ఈ నెల 15వ తేదీ నాటికి సుమారు రూ.43 కోట్లు (50 శాతం), మిగిలిన మొత్తం నెలాఖరుకు వసూలు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. కానీ, ఈ నెల 11వ తేదీ వరకూ రూ.32.27 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. అది కూడా ఆదివారం, సెలవు రోజులని కూడా చూడకుండా ప్రతి ఇంటికీ రెండు మూడుసార్లు తిరిగితేనే కానీ వసూలు కాలేదు. పన్ను వసూళ్లలో లక్ష్యం సాధించలేని వారిపై సస్పెన్షన్ వేటు వేస్తారనే సంకేతాలు రావడంతో పలువురు కార్యదర్శులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
‘ఆన్‌లైన్’తో అవస్థలు
ఇవన్నీ ఒక ఎత్తయితే పన్ను వసూళ్లకు రూపొందించిన ఆన్‌లైన్ వ్యవస్థ అనేక అవస్థలకు కారణమవుతోందని కార్యదర్శులు చెబుతున్నారు. ఈ విధానంలో ప్రజలు ఇంటి పన్ను, కుళాయి పన్నులను తమ మొబైల్ నుంచే చెల్లించాలి. అయితే, పల్లెల్లో మొబైల్ నెట్‌వర్క్ సరిగ్గా పని చేయక, ఆన్‌లైన్ చెల్లింపులకు అనేక అగచాట్లు పడుతున్నారు. మరోవైపు సంబంధిత సర్వర్లు తరచుగా స్తంభించిపోతూ ప్రజలు నరకం చవి చూస్తున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సవాలక్ష పనులు అప్పజెబుతున్నారు. వీటికి తోడు తమ మెడపై ఇప్పుడు పన్ను వసూళ్ల కత్తి పెట్టడంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
క్షేత్ర స్థాయిలో కష్టాలు
ప్రతిసారీ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నెలలో ఇంటి పన్నుల కోసం ముందస్తు నోటీసులు జారీ చేయడం పరిపాటి. అలా జారీ చేసినా, చేయకున్నా ఏప్రిల్ నెలాఖరుకు కార్యదర్శులు పన్నులు వసూ లు చేస్తూండటం ఎప్పటి నుంచో ఉంది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కాక ఈ నిబంధనల ను తుంగలోకి తొక్కి, కొత్త పోకడలకు తెర తీసి, తమపై వసూళ్ల భారం మోపిందని గ్రామ కార్యద ర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకే మొత్తం పన్నులు వసూలు చేయాలనే ఆదేశా లు తమను మానసిక ఆందోళనకు గురి చేస్తున్నా యని లబోదిబోమంటున్నారు. పన్నుల కోసం ఒకే ఇంటికి రెండు మూడుసార్లు తిరుగుతున్నా చేతిలో సొమ్ములు లేవంటూ తిప్పి పంపేస్తున్నారని అంటున్నారు. గట్టిగా అడిగితే కొన్ని గ్రామాల్లో అధికార పార్టీ నేతల పేర్లు చెప్పి ఎదురు తిరుగుతున్నారని ఆవేదన చెందుతున్నారు. రమణయ్యపేట, సర్పవరం, కరప, జగ్గంపేట తదితర గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్లు పెద్ద సవాల్‌గా మారాయని చెబుతున్నారు. పన్ను వసూళ్ల ప్రాతిపదికన పనితీరును నిర్ధారిస్తామని, లేకుంటే వేటువేస్తామని అంటే ఉద్యోగం ప్రశాంతంగా ఎలా చేయగలుగుతామని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఒత్తిళ్లు గతంలో ఏ ప్రభుత్వంలోనూ చూడలేదని అంటున్నారు.


