ఎన్టీఆర్ జలకిరికిరి
● అటకెక్కిన పథకం!
● ఉచిత బోర్లకు మంగళం!
● ఏడాదిన్నరగా పట్టించుకోని సర్కారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: విజయవాడలో రూ.1,750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ఘనంగా చెబుతున్న సర్కారు వారు.. ఆయన పేరిట ఆర్భాటంగా ప్రకటించిన పథకాన్ని మాత్రం అటకెక్కించేశారనే విమర్శలు వస్తున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అంతకు ముందెన్నడూ కనీవినీ ఎరుగని అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే మెట్ట రైతులకు సాగునీటి కడగండ్లను కడతేర్చే లక్ష్యంతో వైఎస్సార్ జలకళ పేరిట బృహత్తర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రభుత్వమే ఉచితంగా బోర్లు వేసి, ఏడాదికి మూడు పంటలు పండించుకునే అవకాశాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అన్ని పథకాల మాదిరిగానే ఈ పథకం పేరును కూడా మార్చేసింది. ‘ఎన్టీఆర్ జలసిరి’గా పేరయితే మార్చారు కానీ, ఈ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేశారు. ఏడాదిన్నర పాలనలో ఒక్కటంటే ఒక్క బోరు కూడా వేయకపోవడమే దీనికి నిదర్శనమని రైతులు అంటున్నారు. కనీసం ఈ పథకం కింద ఉచిత బోరు కోసం దరఖాస్తు చేసుకుందామనుకున్నా సంబంధిత వెబ్‌సైట్ ఇప్పటి వరకూ అందుబాటులోకి రాలేదు. దీని విధివిధానాలను సైతం ప్రభుత్వం ప్రకటించలేదు. దీంతో, ఎన్టీఆర్ పేరిట ఆర్భాటంగా తీసుకొచ్చిన ఈ పథకం మనుగడలో ఉందా, లేదా అనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో 926 బోర్లు
చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశంతో నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ జలకళ పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2020 సెప్టెంబర్ 28న ప్రారంభించారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో నీటి ఎద్దడి అధికంగా ఉండే భూముల్లో ఉచితంగా బోర్లు వేసి, రైతుల సాగునీటి కష్టాలు తీర్చారు. తద్వారా వర్షం పడితేనే సాగు చేయలేని రైతులు ఏడాదికి మూడు పంటలు పండించగలిగే అవకాశం కల్పించారు. ఈ పథకం కింద వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లావ్యాప్తంగా 3,118 దరఖాస్తులు రాగా.. 1,326 ధ్రువీకరణ పొందాయి. వీటిలో 1,306 దరఖాస్తులకు పరిపాలనా ఆమోదం లభించగా.. అత్యధిక అవసరం ఉన్న రైతులకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యాన సుమారు రూ.15 కోట్లు వెచ్చించి 926 బోర్లు వేశారు. కేవలం భూగర్భ జలాల మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న వారికి తొలుత ప్రాధాన్యం ఇచ్చి, వెంటనే పనులు పూర్తి చేశారు. వేసిన బోర్లలో విద్యుత్ సొంతంగా వేసుకున్న రైతులకు ప్రత్తిపాడు, కాకినాడ, కత్తిపూడి క్లస్టర్ల పరిధిలో 99 మోటార్లు సైతం ఉచితంగా అందజేశారు. మిగిలిన రైతులకు బోర్లు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇలా గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం మూడెకరాలు.. ఆరు పంటలుగా సాగింది.
పేరు మార్పుతో సరి
చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన నెల రోజుల తర్వాత వైఎస్సార్ జలకళ పేరును ‘ఎన్టీఆర్ జలసిరి’గా మార్చారు. అక్కడితో సరి. ఏడాదిన్నర అవుతున్నా ఈ పథకం కింద ఏ ఒక్క రైతుకూ ఒక్క బోరు కూడా వేయలేదు. ఖరీఫ్ ముగిసి రబీ సీజన్ ప్రారంభమైన తరుణంలో జిల్లాలోని జగ్గంపేట, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, గండేపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం తదితర మండలాల్లో సాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ పథకం అమలైతే తమకు ఎంతో ఉపయోగపడేదని రైతులు అంటున్నారు. ఈ పథకం అడ్రస్ లేకుండా పోవడంతో ఈ ప్రాంతాల్లోని వేలాది మంది రైతులకు తీరని నష్టమే జరుగుతోంది. ఇప్పటికై నా ఉచిత బోర్ల పథకాన్ని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.
వెంటనే అమలు చేయాలి
ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు పాతాళంలోకి తొక్కేస్తున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల పేర్లను మార్చడం తప్ప అమలు చేయడం లేదు. ముఖ్యంగా రైతులకు సంబంధించిన పథకాలను అమలు చేయకపోవడంతో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి రైతులకు అన్యాయం చేస్తున్నారు. వెంటనే ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని అమలు చేసి, రైతులను ఆదుకోవాలి.
– తిరుమలశెట్టి నాగేశ్వరరావు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, కాకినాడ
మార్గదర్శకాలు రావాలి
ఎన్టీఆర్ జలసిరి పథకంపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఇంతవరకూ దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ పథకంపైఽ అధికారికంగా ఎటువంటి సమాచారమూ లేదు. ఇంతవరకూ ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అమలుకు ఏర్పాట్లు చేస్తాం.
– అడపా వెంకటలక్ష్మి, ప్రాజెక్ట్ డైరెక్టర్, డ్వామా, కాకినాడ
ఎన్టీఆర్ జలకిరికిరి
ఎన్టీఆర్ జలకిరికిరి


