ఆకలి కేకలు
● ఇప్పటి వరకూ అందని గత నెల పారితోషికం
● 250 మంది
వ్రత పురోహితులకు ఇబ్బందులు
● ‘చేతివాటం’ వివాదంతో ఎడతెగని జాప్యం
అన్నవరం: ఒక పురోహితుడు చేసిన అవకతవకల పుణ్యమా అని అన్నవరం దేవస్థానంలోని వ్రత పురోహితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. దేవస్థానం వ్రత విభాగంలో పని చేస్తున్న దాదాపు 250 మంది పురోహితులు పని చేస్తున్నారు. వీరికి పారితోషికంగా వ్రతాల ఆదాయంలో 40 శాతం కమీషన్ చెల్లిస్తారు. ఈవిధంగా ప్రతి నెలా సుమారు రూ.90 లక్షల నుంచి రూ.92 లక్షల వరకూ వారికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పారితోషికం మొత్తం పోనూ మిగిలిన దానిలో 40 శాతం వారి సంక్షేమ నిధికి కేటాయిస్తారు. మిగిలిన మొత్తాన్ని ఏడాది చివరిలో ఎరియర్స్ కింద పంపిణీ చేస్తారు. వ్రత పురోహితులు మొత్తం నాలుగు గ్రేడ్‌లుగా పని చేస్తున్నారు. వీరిలో మూడో గ్రేడ్ పురోహితులకు రూ.25 వేలు, రెండో గ్రేడ్ వారికి రూ.42 వేలు, మొదటి గ్రేడ్ వారికి రూ.45 వేలు, స్పెషల్ గ్రేడ్ పురోహితుల(సూపర్‌వైజర్)కు రూ.48 వేల చొప్పున ప్రతి నెలా పదో తేదీలోగా పారితోషికం (జీతం) చెల్లిస్తారు. ఈ నెలలో 19వ తేదీ వచ్చేసినప్పటికీ.. గత నెల పారితోషికం ఇంకా తమ బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో ఆయా పురోహితుల కుటుంబాలు ఆకలి కేకలు పెడుతున్నాయి.
‘చేతివాటం’పై తనిఖీలతో..
పురోహితుల పారితోషికం బిల్లులు, ఇతర చెల్లింపుల్లో ఓ వ్రత పురోహితుడు రూ.58.39 లక్షల మేర అవకతవకలకు పాల్పడిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో అతడు 2024 జనవరి నుంచి గత ఏడాది నవంబర్ వరకూ చేతివాటం చూపి, ఈ మొత్తం స్వాహా చేశాడు. ఆ పురోహితుడిని నమ్మిన వ్రత విభాగం సిబ్బంది అతడు రూపొందించిన బిల్లులను సరిగ్గా పరిశీలించకుండానే సంతకాలు చేశారు. మరోవైపు అతడు కొంత మంది పురోహితుల ఖాతాలకు వారికి రావాల్సిన పారితోషికాల కన్నా అధిక మొత్తం జమ చేశాడు. ఈ విషయాన్ని వారు కూడా అధికారుల దృష్టికి తీసుకురాలేదు. ఈ అవకతవకల నేపథ్యంలో గత పదేళ్లుగా వ్రత విభాగంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఇటీవల అధికారులు లోతుగా తనిఖీలు చేశారు.
ఆడిట్‌కు పంపించినా..
దేవస్థానంలో ప్రతి బిల్లును ప్రీ ఆడిట్ కోసం పంపిస్తారు. దేవస్థానం సిబ్బంది అవకవతకలకు పాల్పడితే ఆడిట్‌లో ఆ తప్పులు పట్టుకుని సరి చేయాల్సిందిగా వెనక్కి పంపిస్తారు. అయితే, గత రెండేళ్లుగా పురోహితుల పారితోషికం బిల్లును ఆడిట్‌కు పంపించినా.. చేతివాటం చూపిన పురోహితుడిని నమ్మిన ఆడిట్ అధికారులు ఎటువంటి తనిఖీ చేయకుండానే ‘బిల్ వెరిఫైడ్’ అని సంతకాలు చేసేవారు. ఆడిట్ అధికారి నుంచి ఆ బిల్లు తన వద్దకు రావడంతో ఈఓ కూడా సంబంధిత చెక్కుపై సంతకం చేసేవారు. అయితే, ఈ బిల్లులు రూపొందించిన వ్రత పురోహితుడి చేతివాటం బాగోతం ఇటీవల బయట పడటంతో అధికారులు మేల్కొన్నారు. గత నెలకు సంబంధించిన పురోహితుల పారితోషికం బిల్లును అధికారులు ఈ నెల ఏడో తేదీన రూపొందించి ఆడిట్ విభాగానికి పంపించగా.. ఈ నెల 14న దానిపై కొన్ని కొర్రీలు వేశారు. వాటికి అధికారులు సమాధానం రాసి పంపించారు. తరువాత సంక్రాంతి సెలవులు రావడంతో ఆ బిల్లు ఆడిట్ విభాగంలోనే ఉండిపోయింది. ఇప్పుడు ఆ బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆడిట్ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. వారు పాస్ చేశాక ఈ బిల్లు ఈఓ వద్దకు వెళ్తుంది. ఆయన ఆ బిల్లు చూసి సంతృప్తి చెందిన తరువాతే సంబంధిత చెక్కుపై సంతకం చేస్తారు. అనంతరం ఆ చెక్కు స్టేట్ బ్యాంక్‌కు పంపిస్తారు. మూడు, నాలుగు రోజుల్లో పురోహితులకు పారితోషికం జమయ్యేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు.
బ్యాంక్‌లో పరిశీలించాకే..
గతంలో దేవస్థానం నుంచి ఏ చెక్కు వచ్చినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అధికారులు నిమిషాల్లో ఆయా అకౌంట్లలో జమ చేసేవారు. అయితే, పురోహితుని చేతివాటం వ్యవహారంతో వారు కూడా కంగు తిన్నారు. పురోహితుల పారితోషికం బిల్లు ఒరిజనల్ కాపీ పరిశీలించకుండా ఆన్‌లైన్‌లో వచ్చిన ఎక్సెల్ షీట్‌లో ఉన్న వారి ఖాతాలకు నగదు జమ చేశారు. ఒరిజనల్ కాపీలోని పురోహితుల పారితోషికాల మొత్తం రూ.90 లక్షలు వస్తే అవకతకవలకు పాల్పడిన పురోహితుడు రూ.92 లక్షలుగా చూపించేవాడు. ఆన్‌లైన్ కాపీలో మాత్రం రూ.92 లక్షలకు సరిపడా కిట్టించేవాడు. ఆ మేరకు బ్యాంకు అధికారులు పురోహితులకు నగదు జమ చేసేవారు. అంతా ఆన్‌లైన్‌లోనే కనుక ఎవ్వరికీ అనుమానం రాలేదు. ఇలా రెండేళ్లు జరిగింది. గతంలో కూడా ఆన్‌లైన్‌లో వచ్చిన అకౌంట్ల ప్రకారమే నగదు జమ చేశామని, ఒరిజనల్ కాపీ ఎప్పుడూ పరిశీలించలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. తమకు వేల సంఖ్యలో ఉద్యోగులున్న సంస్థల నుంచి కూడా ఆన్‌లైన్ జాబితాలు వస్తాయని, వాటి ప్రకారం జీతాలు జమ చేస్తామని అంటున్నారు. అయితే, వ్రత పురోహితుడి చేతివాటం బాగోతం బయట పడటంతో పురోహితుల పారితోషికం బిల్లును ఒరిజనల్ జాబితాతో సరిచూశాకే వారి ఖాతాలకు జమ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. దీని వలన ఒకటి రెండు రోజుల జాప్యం తప్పదని అంటున్నారు.
అన్నవరం దేవస్థానం
కానుకల విషయంలో కఠిన వైఖరి
ఇదిలా ఉండగా వ్రతాల అనంతరం పురోహితులకు భక్తులు కానుకలు ఇవ్వడం సంప్రదాయంగా ఉంది. గతంలో తోచిన కానుకలు ఇవ్వాలని పురోహితులు కోరేవారు. ఇదే అదనుగా పాలకొల్లులో జరిగిన సామూహిక వ్రతాల్లో కొంతమంది పురోహితులు కానుకల కింద రూ.201, రూ.500 అడగడం వివాదాస్పదమైంది. దీంతో, భక్తులను ఏమీ అడగవద్దని పురోహితులను ఈఓ ఆదేశించారు. దీనివలన కూడా వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. మొత్తం 250 మందిలో 25 మంది మినహా మిగిలిన పురోహితులందరూ పారితోషికాలు చాలక భక్తులు ఇచ్చే కానుకలతో జీవనం సాగించేవారే. ఇప్పుడు వారందరూ ఇబ్బంది పడుతున్నారు.


