‘డబ్బు వసూళ్లపై విచారణ చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘డబ్బు వసూళ్లపై విచారణ చేయాలి’

Jan 20 2026 7:38 AM | Updated on Jan 20 2026 7:38 AM

‘డబ్బు వసూళ్లపై  విచారణ చేయాలి’

‘డబ్బు వసూళ్లపై విచారణ చేయాలి’

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): సంక్రాంతి కోటి పందేల బరుల వద్ద, గుండాట నిర్వహించిన వారి నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, దీనిపై పూర్తి స్థాయి విచారణ చేయాలని కాకినాడ రూరల్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు జర్నలిస్టులు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఇన్‌చార్జి కలెక్టర్‌ అపూర్వ భరత్‌కు ఫిర్యాదు చేశారు. సంక్రాంతి సందర్భంగా వృత్తి రీత్యా బరుల వద్దకు వెళ్లి ఫొటోలు తీస్తూండగా కొందరు కోడిపందేల నిర్వాహకులు కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరుడు శ్రీనివాస్‌కు డబ్బులు ఇచ్చినట్లు తమ చెప్పారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేయాలని కోరారు. వృత్తి రీత్యా కోడిపందేల బరులు, గుండాట నిర్వహిస్తున్న సమయంలో ఫొటోలు తీస్తున్న తమను అడ్డుకున్న వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవాలని సీనియర్‌ జర్నలిస్టు మోహనరావు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై ఆయనతో పాటు పలువురు సీనియర్‌ జర్నలిస్టులు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

రాష్ట్రంలో దిగజారిన

శాంతిభద్రతలు

జగ్గంపేట: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైఎస్సార్‌ సీపీ దళిత కార్యకర్త సాల్మన్‌ దారుణ హత్య రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు నిదర్శనంగా నిలుస్తోందని వైఎస్సార్‌ సీపీ క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్‌వెస్లీ మండిపడ్డారు. జగ్గంపేటలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరుగుతున్నా ప్రజలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఊరు విడిచి ఎక్కడో ఉంటూ తన భార్యను చూసేందుకు వచ్చిన మంద సాల్మన్‌ను ఐరన్‌ రాడ్లతో దారుణంగా కొట్టి హతమార్చారని, దీని వెనుక కూటమి నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ దళితులకు రక్షణ లేకుండా పోయిందని, వైఎస్సార్‌ సీపీకి చెందిన దళిత నేతలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని అన్నారు. సాల్మన్‌ హత్యపై వేగంగా దర్యాప్తు చేసి, దీనికి కారకులైన వారిని తక్షణం అరెస్ట్‌ చేసి వారికి శిక్ష పడేలా చేయాలని జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. సమావేశంలో క్రిస్టియన్‌ నేతలు గుడాల శాంతిప్రసాద్‌, రాజారత్నం, నొక్కు విజయరాజు తదితరులు పాల్గొన్నారు.

రేపు జెడ్పీ సమావేశం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం (బడ్జెట్‌), స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు బుధవారం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరుగుతుందన్నారు. అనంతరం స్థాయి సంఘ సమావేశాలు జరుగుతాయని తెలిపారు.

పీజీఆర్‌ఎస్‌కు 268 అర్జీలు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 268 అర్జీలు సమర్పించారు. వారి నుంచి ఇన్‌చార్జి కలెక్టర్‌ అపూర్వ భరత్‌, వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆదేశించారు.

ఫిబ్రవరిలో రాష్ట్ర స్థాయి

బాడీబిల్డింగ్‌ పోటీలు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్‌ పోటీలు ఫిబ్రవరి 22న కాకినాడలో నిర్వహించనున్నట్లు ఏపీ బాడీబిల్డింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఖాసిం తెలిపారు. స్థానిక ఆనంద భారతి గ్రౌండ్స్‌లో న్యూ ఆంధ్రా బాడిబిల్డింగ్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. అసోసియేషన్‌ చైర్మన్‌, మాజీ ఒలింపిక్‌ సంఘ కార్యదర్శి కె.పద్మనాభం తదితరులు రాష్ట్ర స్థాయి పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఖాసిం మాట్లాడుతూ, ఇక నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడానికి కార్యవర్గం నిర్ణయించిందన్నారు. పద్మనాభాన్ని ఈ సందర్భంగా సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement