‘దేవ, పితృ కార్యాలను వదిలితే భ్రష్టుడవుతాడు’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘దేవ కార్యాలు చేయడం ఎంత అవసరమో, పితృకార్యాలు చేయడం కూడా అంతే అవసరం, దేవ పితృ కార్యాలను వదిలితే మానవుడు భ్రష్టుడవుతాడని భీష్ముడు ధర్మరాజుతో చెప్పాడ’ని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారతంలోని శాంతి, అనుశాసన పర్వాలను ముగించి, అశ్వమేధిక పర్వాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ముందుగా అనుశాసన పర్వంలోని భీష్మ నిర్యాణాన్ని ఆయన వివరించారు. ‘‘పితృయజ్ఞం కూడా నారాయణాత్మకం. పితృ దేవతలను పిండరూపంలో దర్భలపై ఉంచి అర్చించిన వాడు వరాహ స్వామి. దేవతలను, పితరులను, గురువును, అతిథులను, వేదవేత్తలను, తల్లిని, భూమిని అర్చిస్తే శ్రీహరిని అర్చించినట్టేనని ధర్మరాజుకు భీష్ముడు వివరిస్తాడు. పితృకార్యాలు చేయనిదే దేవతల అనుగ్రహం కూడా కలగదు. ధర్మరాజుకు సమస్త ధర్మాలను వివరించాక, కళేబరాన్ని విడిచిపెట్టడానికి శ్రీకృష్ణుని అనుమతిని భీష్ముడు కోరాడు. ‘నీలో కించిత్తు పాపం లేదు, నీవు వసులోకానికి వెళ్తావ’ని కృష్ణపరమాత్మ అను మతి ఇస్తాడు. పాండు సుతులకు భీష్ముడు తుది సందేశాన్ని ఇస్తూ, ‘సత్యం, ధర్మం, ఆత్మ సంయమనం కలిగి ఉండాలి, ధర్మం మీ స్వభావం కావాల’ని చెబుతాడు. భీష్ముడు శరీరం పరిత్యజించాక, గంగాదేవి వచ్చి శోక వివశురాలవుతుంది. ‘ఈ మహావీరుడు చివరకు ఒక శిఖండి చేతిలో మరణించాడ’ని ఆవేదన వ్యక్తం చేస్తుంది. కృష్ణుడు ఆమెను ఓదారుస్తూ, ‘అర్జునుడి చేతిలోనే భీష్ముడు మరణించాడని, ఆయనకు ఉత్తమ లోకాలు కలుగుతాయి’ అంటూ అనునయిస్తాడు’’ అని సామవేదం వివరించారు. అనంతరం, అశ్వమేధిక పర్వ ప్రవచనాన్ని ప్రారంభించారు. ‘‘భీష్ముడి నిర్యాణంతో ధర్మరాజు తిరిగి శోకానికి లోనవుతాడు. వ్యాసుడు మందలింపు ధోరణిలో ‘నీకు మేము చెప్పిన ధర్మాలన్నీ వ్యర్థ ప్రలాపాలయ్యాయి. నీవు ఏకాగ్రతతో ఆ ధర్మాలను ఆకళింపు చేసుకోలేదనిపిస్తోంది, నీవు ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న భావనలో ఉంటే అశ్వమేధ యాగం చేయి’ అని వ్యాస కృష్ణులు సూచిస్తారు. ‘ఖజానా ఖాళీ అయింది, ఈ యాగాన్ని ఎలా చేయగలనని ధర్మరాజు సందేహం వ్యక్తం చేస్తాడు. హిమవత్పర్వత ప్రాంతంలో మరుత్తుడు అనే రాజు యజ్ఞంలో ఇచ్చిన ధనాన్ని బ్రాహ్మణులు మోయలేక, అక్కడే వదిలేశారని, ఆ ధనంతో యాగం నిర్వహించాలని వ్యాసుడు సూచిస్తాడు. యుధిష్ఠిరుడు శకకర్త. ఆయన పాలనలో ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లార’’ని సామవేదం చెప్పారు.


