మౌలిక సదుపాయాలు కల్పించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయల కల్పనకు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై విద్యా శాఖ, వివిధ సంక్షేమ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్‌లో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అన్ని హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు సక్రమంగా నిర్వహించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. విద్యార్థులకు అవసరమైన రక్షిత మంచినీరు అందుబాటులో ఉంచాలన్నారు. వసతి గృహాల్లో అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు వేడి నీరు అందించాలన్నారు. వార్షిక పరీక్షలకు విద్యార్థులను ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం సన్నద్ధం చేయాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, మరమ్మతులు, ప్రహరీల నిర్మాణం వంటి అంశాలపై ఈ నెలాఖరుకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఈఓ పి.రమేష్, ఇన్‌చార్జి బీసీ సంక్షేమ అధికారి జి.శ్రీనివాసరావు, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ వెంకటపతిరాజు పాల్గొన్నారు.
కనకదుర్గమ్మకు
బంగారు హారం
పి.గన్నవరం: మండలంలోని మొండెపులంక గ్రామంలో కొలువు దీరిన విజయ కనకదుర్గమ్మ వారికి భీమవరానికి చెందిన అయినపర్తి దుర్గాభవాని, ఆమె కుటుంబ సభ్యులు సోమవారం రూ.7 లక్షల విలువైన బంగారు హారం సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో కోరుమిల్లి శ్రీను, పార్వతి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పించాలి


