అతితెలివితో అడ్డంగా దొరికి..
● బాలిక హత్య కేసులో నిందితుడి అరెస్టు
● అప్పులపాలై అడ్డదారిలో వెళ్లి దురాగతం
● ఆత్మహత్యను హత్య కేసుగా నమోదు
● చాకచక్యంగా ఛేదించిన పోలీసులు
రామచంద్రపురం: అత్యాసకు పోయి, దొంగతనం చేస్తూ అన్నెం పున్నెం ఎరుగని బాలికను హత్య చేసి మీడియాను, పోలీసులను తప్పుదోవ పట్టించే యత్నంలో చివరకు హంతకుడు పోలీసులకు దొరికిపోయాడు. రామచంద్రపురం పట్టణంలో ఈ నెల 4న జరిగిన బాలిక మృతి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో వెలుగు చూసిన విషయాలు విస్మయం కలిగించాయి. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. రామచంద్రపురం మండలం అంబికపల్లి అగ్రహారానికి చెందిన పెయ్యల వీరవెంకట శ్రీనివాస్, అలియాస్ శ్రీనివాస్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ ఒక యూట్యూబ్ చానల్‌కు రిపోర్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. పట్టణంలోని త్యాగరాజు నగర్‌లో ఒక ఇంట్లో చిర్రా సునీత తన కూతురుతో కలిసి అద్దెకు ఉంటున్నారు. వీరి కుటుంబంతో శ్రీనివాస్ సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే శ్రీనివాస్ బ్యాంకు అప్పులు, చెల్లెలి పెళ్లికి చేసిన అప్పులు వంటి వాటితో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ ఈనెల 4వ తేదీన సునీత ఇంటికి వెళ్లాడు. అప్పటికే సునీత కుమార్తె (10) ఇంట్లో ఉంది. బంగారం, సొమ్ము అపహరించేందుకు వచ్చిన శ్రీనివాస్ ఇంట్లోకి రాగానే ఆ చిన్నారి ఎందుకు వచ్చావని ప్రశ్నించింది. ఫ్యాన్ రిపేరు చేయటానికి వచ్చానని అబద్ధం చెప్పాడు. దీంతో ఫ్యాన్ బాగానే ఉంది కదా అమ్మకు ఫోన్ చేసి చెబుతాను అని ఫోన్ చేస్తుండగా తన బండారం ఎక్కడ తెలిసిపోతుందోనని ఇంట్లో మంచం మీద ఉన్న చున్నీని బాలిక మెడకు చుట్టి మంచంపైకి తోసి అమె ముఖాన్ని మంచంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా బాలిక శవాన్ని చున్నీతో ఫ్యాన్‌కు ఉరితీయటం ద్వారా ఆత్మహత్యగా చిత్రీకరించాడు. తనకు ఉన్న అనుభవంతో తలుపులు లోపల గడియపెట్టి వెళ్లిపోయాడు. తన విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సునీత తన కూతురు ఉరి వేసి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే ఇంట్లోనే ఉంటూ తనకు ఏమీ తెలియనట్లు వ్యవహరించిన శ్రీనివాస్, ఏం జరుగుతుందనే విషయాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు లీకులు ఇస్తూ ఉండేవాడు. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. బాలిక మృతిలో అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్న శ్రీనివాస్‌పై పోలీసులకు అనుమానం వచ్చి అతని వేలిముద్రలు కూడా సేకరించారు. అయితే ఇంట్లో ఉన్న ఫ్యానుకు, తదితర చోట్ల ఉన్న వేలిముద్రలతో సరిపోలడంతో అతడిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్, సీఐ వెంకటనారాయణ, ఎస్సై ఎస్.నాగేశ్వరరావు ఎంతో చాకచక్యంగా అన్ని కోణాల్లోను దర్యాప్తు చేయటంతో శ్రీనివాస్ బాలికను హత్య చేసినట్లు నిర్థారించినట్టు ఎస్పీ వెల్లడించారు. అప్పుల పాలైన శ్రీనివాస్ దొంగతనం చేసే ప్రయత్నంలో బాలికను హతమార్చినట్లు తెలిపారు. అన్ని కోణాల్లోను దర్యాప్తును ముమ్మరం చేసి నిందితుడిని పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు.


