ప్రతిభకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

ప్రతిభకు ప్రోత్సాహం

Nov 10 2025 7:28 AM | Updated on Nov 10 2025 7:28 AM

ప్రతి

ప్రతిభకు ప్రోత్సాహం

విద్యార్థులను ప్రోత్సహించండి

ఆన్‌లైన్‌లో పరీక్షలు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు

ఎడ్యుకేషనల్‌ ఎపిఫనీ మెరిట్‌ టెస్ట్‌

పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ దరఖాస్తులకు ఆహ్వానం

రిజిస్ట్రేషన్‌కు 14 తుది గడువు

రాయవరం: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజన, ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వంతో పాటు, పలు ఎన్‌జీవో సంస్థలు ఏటా వివిధ పరీక్షలు నిర్వహిస్తుంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎడ్యుకేషనల్‌ ఎపిఫనీ మెరిట్‌ టెస్ట్‌(ఈఈఎంటీ) స్వచ్ఛంధ సంస్థ ప్రభుత్వ పాఠశాలల్లోని 7, 10 తరగతుల విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరానికి ప్రతిభా పరీక్షను నిర్వహించనుంది. 12 ఏళ్లుగా ఎటువంటి రుసుమూ లేకుండా ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరీక్షకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు అక్టోబరు 30న షెడ్యూల్‌ను విడుదల చేశారు.

నచ్చిన చోటే పరీక్ష

ఈఈఎంటీ పరీక్ష ప్రిలిమ్స్‌, మెయిన్‌ రెండు దశల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షను విద్యార్థి అభీష్టం మేరకు ఇంటి వద్ద నుంచి లేదా పాఠశాల నుంచి అటెండ్‌ అయ్యే అవకాశం కల్పించారు. ఈ పరీక్షలను శ్రీకోడ్‌ తంత్రశ్రీ సాఫ్ట్‌వేర్‌ ద్వారా నిర్వహిస్తారు. డిసెంబరు 6న ప్రిలిమినరీ పరీక్ష, 7న ఫలితాలు విడుదల చేస్తారు. 40 శాతం పైబడి మార్కులు పొందడంతో పాటుగా, ఆన్‌లైన్‌ పరీక్ష నియమ నిబంధనలు సక్రమంగా పాటించిన వారు మెయిన్‌ పరీక్షకు అర్హత పొందుతారు. మెయిన్‌ పరీక్షకు డిసెంబరు 8 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష డిసెంబరు 27న నిర్వహిస్తారు. జిల్లాకు ఒక పరీక్ష కేంద్రం ఉండగా, అభ్యర్థి ఎంచుకున్న కేంద్రంలో పరీక్ష రాయాలి. పరీక్షలో 50 శాతం మార్కులు పొంది ఆన్‌లైన్‌ నిబంధనలు కచ్చితంగా పాటించిన వారికి బహుమతులు అందజేస్తారు. పరీక్షను మొబైల్‌ ఫోన్‌/ల్యాప్‌టాప్‌/ట్యాబ్‌/కంప్యూటర్‌ వీటిలో ఏదైనా ఒక దానిని ఎంచుకుని నిబంధనలకు లోబడి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌ రాసే వారికి నవంబరు 29న మాక్‌ టెస్ట్‌, మెయిన్స్‌ పరీక్ష రాసే వారికి డిసెంబరు 20న మాక్‌ టెస్ట్‌ రాసే అవకాశం కల్పిస్తారు. హెచ్‌టీటీపీఎస్‌:ఎడ్యుకేషనల్‌ఎపిఫనీ.ఓఆర్‌జీ–ఈఈఎంటీ2026/రిజిస్ట్రేషన్‌.పీహెచ్‌పీ లింక్‌ ద్వారా అభ్యుర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

రెండు మాధ్యమాల్లో పరీక్షలు

విద్యార్థులకు రాష్ట్ర అకడమిక్‌ క్యాలెండరు 2025–26 సిలబస్‌ను అనుసరించి, డిసెంబరులో పూర్తయిన సిలబస్‌పై 80 శాతం ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్‌పై 20 శాతం ప్రశ్నలు ఇస్తారు. తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో పరీక్షలు ఉంటాయి. గణితం, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టులు, జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌ (విద్యార్థుల తరగతి స్థాయి) మేధా సంబంధిత ప్రశ్నలు ఇస్తారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో విద్యార్థి పేరు, పరీక్ష రాసే మొబైల్‌ నంబరు, విద్యార్థి/తల్లిదండ్రుల ఈ మెయిల్‌, విద్యార్థి పుట్టిన తేదీ, విద్యార్థి ఫొటో (2ఎంబీ కన్నా తక్కువ సైజు), తరగతి, జిల్లా, మండలం, పాఠశాల పేరు, హెచ్‌ఎంల పేరు, హెచ్‌ఎం ఈ మెయిల్‌ వంటి వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

పరీక్ష నిర్వహణ ఇలా

గణితం, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టులపై పరీక్ష ఉంటుంది. విద్యార్థుల తరగతి స్థాయి ఆధారంగా జనరల్‌ నాలెడ్జ్‌ మరియు కరెంట్‌ అఫైర్స్‌పై ప్రశ్నలు ఇస్తారు. ప్రిలిమ్స్‌ పరీక్షలో 60 ప్రశ్నలు 100 మార్కులకు, మెయిన్స్‌ పరీక్ష 60 ప్రశ్నలు 100 మార్కులకు ఇస్తారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు 60 నిమిషాల నిడివితో నిర్వహిస్తారు. 1 తేలిక మార్కు ప్రశ్నలకు ఒకటి, మధ్యస్థ రకం ప్రశ్నలకు 2, కఠినతరం ప్రశ్నలకు మూడు మార్కుల వంతున కేటాయిస్తారు.

బహుమతులు ఇచ్చేదిలా

ఈ పోటీల్లో 162 మంది విజేతలకు దాదాపుగా రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తతీయ బహుమతిగా రూ.20వేలు, 7వ తరగతితో రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తతీయ స్థానాల్లో నిలిచిన వారికి అందజేస్తారు. జిల్లా స్థాయిలో 10వ తరగతిలో రూ.8వేలు, రూ.6వేలు, రూ.4వేలు, 7వ తరగతి విద్యార్థులకు రూ.5వేలు, రూ.4వేలు, రూ.3వేలు వరుసగా మూడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులుగా ఇస్తారు. మండల స్థాయిలో 10, 7 తరగతుల్లో ప్రథమ స్థానం పొందిన వారికి జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి ప్రశంసా పత్రాన్ని మాత్రమే ఇస్తారు. మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఈఈఎంటీ–2025 పరీక్షకు సంబంధించి మరింత సమాచారారం తెలుసుకునే వారు, సందేహాల నివృత్తికి 9951002400 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని పూర్వపు స్టేట్‌ కోఆర్డినేటర్‌ దూదేకుల నబి తెలియజేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈఈఎంటీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు అధిక శాతం హాజరయ్యేలా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి.

– డాక్టర్‌ షేక్‌ సలీం బాషా, డీఈవో, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా

ఈఈఎంటీ పరీక్షలను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు తవనం వెంకట్రావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న సంస్థ ద్వారా పూర్తిగా ఉచితంగా పోటీలు నిర్వహిస్తున్నాం.

– దూదేకుల నబి, ఈఈఎంటీ,

పూర్వపు రాష్ట్ర సమన్వయ కర్త

ప్రతిభకు ప్రోత్సాహం 1
1/3

ప్రతిభకు ప్రోత్సాహం

ప్రతిభకు ప్రోత్సాహం 2
2/3

ప్రతిభకు ప్రోత్సాహం

ప్రతిభకు ప్రోత్సాహం 3
3/3

ప్రతిభకు ప్రోత్సాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement