పదికి పదునైన ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

పదికి పదునైన ప్రణాళిక

Nov 8 2025 7:16 AM | Updated on Nov 8 2025 7:16 AM

పదికి

పదికి పదునైన ప్రణాళిక

వంద శాతం ఫలితాలే లక్ష్యం

వంద రోజుల కార్యాచరణకు సన్నద్ధం

జిల్లా ర్యాంకు పెంచేందుకు

డిసెంబర్‌ ఒకటి నుంచి అమలు

ఇప్పటికే 85 శాతం సిలబస్‌ పూర్తి

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి ఫలితాల్లో జిల్లా ర్యాంకు ఏ యేటికాయేడు దిగజారిపోతోంది. ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు రెండు, మూడు స్థానాల్లో ఉండే ర్యాంకు రాను రాను పడిపోతోంది. గత ఏడాది 15 ర్యాంక్‌లోకి జారిపోయింది. ఈ సారి ఉత్తమ ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో జిల్లా విద్యాశాఖాధికారి నూతన కార్య క్రమానికి రూపకల్పన చేశారు. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు వంద రోజుల ప్రణాళిక రూపొందించారు. దీనిని పక్కాగా అమలు చేయాలని ఎంఈఓలు, డీవైఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు ఈ పదునైన ప్రణాళిక ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు.

ఉత్తమ ఫలితాలకు పది సూత్రాలు..

● జిల్లా వ్యాప్తంగా ఏటా ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉన్న పాఠశాలల్లో బోధనను విద్యాశాఖాధికారులు నిత్యం పర్యవేక్షించాలి. ప్రతిరోజూ పాఠశాలలను సందర్శించాలి.

● ఆ సమయంలో విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి, బోధన తీరు మెరుగుపరిచేందుకు కృషి చేయాలి.

● క్లిష్టమైన పాఠ్యాంశాలైన గణితం, ఆంగ్లం, సైన్స్‌ బోధన ఎలా సాగుతోందో పక్కాగా పరిశీలించాలి.

● ఆయా పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా పరీక్షల్లో తప్పకుండా వస్తాయని భావించే ప్రశ్నలను విద్యార్థులకు బోధించాలి.

● పరీక్షల్లో తప్పకుండా ఇస్తారు అని భావించే ప్రశ్న లను విద్యార్థులు సులువుగా అర్ధం చేసుకుని రాసేలా మెరుగైన శిక్షణ ఇవ్వాలి.

● చదువులో వెనుబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి, వారు ప్రతి సబ్జెకులోనూ ఉత్తీర్ణులయ్యేలా తీర్చిదిద్దాలి.

● పరీక్షల్లో తప్పక వస్తాయని భావించే ప్రశ్నలను ప్రతిరోజూ విద్యార్థులతో చూడకుండా రాయించాలి. వారికి హోమ్‌వర్క్‌ కూడా ఇవ్వాలి.

● ఉపాధ్యాయులు ప్రతివారం విద్యార్థుల సామర్థ్యానికి సంబంధించిన నివేదికను రూపొందించి వారికి ఇవ్వాలి. బాగా వెనుబడిన విద్యార్థులను దత్తత తీసుకుని వారికి శిక్షణ ఇవ్వాలి.

● పాఠశాల హెచ్‌ఎం ప్రతివారం విద్యార్థులు ఎన్ని మార్కులు సాధిస్తారనే అంశంపై నివేదిక రూపొందించి, ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేయాలి.

● విద్యార్థులకు బొమ్మలు గీయడం, మ్యాప్‌ పాయింటింగ్‌, గ్రాఫ్‌ తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారిని పరీక్షలకు సమాయత్తం చేయాలి.

మార్చి 16 నుంచి పది పరీక్షలు

2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయులు అందుకు తగిన విధంగా అప్రమత్తం చేయాలని సూచించారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నవంబర్‌ లోపు పూర్తి సిలబస్‌ పూర్తి చేయాలని డీఈఓ ఆదేశించారు. అలాగే పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మూడు నెలలుగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు డీఈఓ పిల్లి రమేష్‌ తెలిపారు. ఇందులో ప్రధానంగా విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆయన ఆదేశిం చారు. ప్రతి విద్యార్థినీ సంబంధిత ఉపాధ్యాయులు దత్తత తీసుకుని, వారి అభ్యసన స్థాయిని నిరంతరం పరిశీలించాలని తెలిపారు. ఏదైనా పాఠ్యాంశంలో వెనకబడి ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతిరోజు ఒక పాఠ్యాంశం చొప్పున రివిజన్‌ చేయాలని, ప్రతి విద్యార్థి తప్ప నిసరిగా ఉత్తీర్ణత సాధించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది 29,866 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని ఆయన తెలిపారు.

పర్యవేక్షణ.. పాఠశాలల సందర్శన..

మండల, జిల్లాస్థాయి విద్యాశాఖాధికారులు నిత్యం పాఠశాలలను సందర్శించి, బోధన విధానం, విద్యార్థుల అభ్యసన స్థాయిపై సూచనలు జారీ చేస్తున్నారు. పాఠశాలలో సిలబస్‌ పూర్తి చేయని ఉపాధ్యాయులు పక్కాగా ఈ నెలలో సిలబస్‌ పూర్తి చేసి తీరాల్సి ఉంది. స్లో లెర్నర్స్‌ కోసం ఇప్పటికే స్టడీ మెటీరియల్‌ ప్రతి పాఠశాలకు అందించారు.

ప్రథమ స్థానంలో నిలిపేందుకు..

డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి జిల్లాలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులోకి రానుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులను పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం చేయడానికి అన్ని చర్యలు తీసుకోనున్నాం. చదువులో కాస్త వెనుకబడిన విద్యార్థులను సైతం ఈ ప్రణాళికతో ఉత్తీర్ణత దిశగా సన్నద్ధం చేస్తాం. వచ్చే ఏడాది పది ఫలితాల్లో కాకినాడ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాం.

– పిల్లి రమేష్‌, డీఈఓ, కాకినాడ జిల్లా

జిల్లాలో పది ఫలితాల వివరాలు

సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణులు ఉత్తీర్ణత

హాజరు శాతం

2021–22 66,175 46,579 65.83

2022–23 27,358 18,608 68.02

2023–24 27,671 22,993 83.09

2024–25 27368 22,508 82.24

పదికి పదునైన ప్రణాళిక1
1/1

పదికి పదునైన ప్రణాళిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement