ఆరోగ్యశ్రీ.. తీస్తున్నారా ఊపిరి! | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ.. తీస్తున్నారా ఊపిరి!

Oct 10 2025 6:36 AM | Updated on Oct 10 2025 6:36 AM

ఆరోగ్

ఆరోగ్యశ్రీ.. తీస్తున్నారా ఊపిరి!

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎంతో మంది ప్రాణాలు నిలిపి.. ఎన్నో కుటుంబాల్లో కొత్త వెలుగులను ప్రసరింపజేసి.. ఆపన్నులకు అపర సంజీవనిగా నిలిచిన ఆరోగ్యశ్రీ (కూటమి సర్కారు ‘ఎన్టీఆర్‌ వైద్య సేవ’గా పేరు మార్చింది) ఊపిరిని ఆపివేసేందుకు కూటమి సర్కారు శతవిధాల ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పథకం కింద నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఏడాదికి పైబడి కోట్లాది రూపాయల మేర బకాయిలు పెట్టింది. ఈ బకాయిల గుదిబండను ఇక మోయలేమంటూ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు శుక్రవారం నుంచి సమ్మె బాట పడుతున్నాయి. ఈ పథకం కింద కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందుకుంటున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ వార్త అశనిపాతమే అవుతోంది.

పైసా ఖర్చు లేకుండా..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. పేద, మధ్య తరగతి ప్రజలకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని అందించింది. క్యాన్సర్‌ వంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు పరిమితి లేకుండా సాయం అందించింది. ఈ పథకం కింద 1,059 ప్రొసీజర్లు (చికిత్సలు) అందిస్తూండగా.. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సంఖ్యను ఏకంగా 3,257కి పెంచారు. అంతే కాకుండా, కుటుంబానికి రూ.5 లక్షల వరకూ ఉన్న చికిత్స పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచారు. తద్వారా పేదల ఆరోగ్యానికి ఎంతో భరోసా కల్పించారు. జిల్లాలో ఎన్‌టీఆర్‌ వైద్యసేవ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు 32 ఉన్నాయి. వీటిల్లో ప్రతి రోజూ 2,500 వరకూ ఓపీ నమోదవుతుండగా ఇన్‌ పేషెంట్లుగా ఐదారు వందల మంది వరకూ ఈ పథకం కింద చేరుతున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని రోగులకు ప్రతి నెలా రూ.25 కోట్ల విలువైన శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని అంచనా. ఈవిధంగా పేదల పాలిట కల్పతరువుగా నిలిచిన ఈ మహత్తర పథకానికి మంగళం పాడేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కారు ఎత్తులు వేస్తోంది. ఈ పథకం స్థానంలో ఆరోగ్య బీమా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు కోట్లాది రూపాయల మేర బకాయిలు చెల్లించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బకాయిల గుదిబండ

జిల్లాలోని ఎన్టీఆర్‌ వైద్య సేవ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.110 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో ఆస్పత్రికి రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ బకాయిలున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాదిన్నర అవుతోంది. ఈ బకాయిలు కూడా ఏడాది నుంచి తొమ్మిది నెలల కాలంలో ఉన్నవే. వీటిని వెంటనే విడుదల చేయాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆషా) నెల రోజుల క్రితం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ, ప్రభుత్వం స్పందించలేదు. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సమ్మె అనివార్యమైంది. ఇంత కాలం పంటి బిగువన సమస్యలు భరించామని, ఇక తమ వల్ల కాదని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు స్పష్టం చేస్తున్నాయి. కోట్లాది రూపాయల మేర బకాయిలు చెల్లించకపోతే తాము ఎంత కాలం వైద్య సేవలు అందించగలుగుతామని ప్రశ్నిస్తున్నాయి. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయిల విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టంగా వివరించినా ఫలితం లేదని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 25న సమావేశమైన ఆషా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ మేరకు కాకినాడ సహా జిల్లాలోని 32 ప్రైవేటు, కార్పొరేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఆయా ఆస్పత్రుల్లో రోగులకు సహకారం అందించే ఆరోగ్యశ్రీ హెల్ప్‌ డెస్క్‌లలో ఆరోగ్య మిత్రలు లేకుండా చేస్తున్నారు.

ప్రజల ఆందోళన

నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మె బాట పట్టడంతో ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద ఉచిత చికిత్సలు అందక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యశ్రీపై ఉచిత వైద్య సేవలు పొందేందుకు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వచ్చే రోగులు సొమ్ము చెల్లిస్తేనే వైద్యం అందే పరిస్థితి కనిపిస్తోంది. సొమ్ము చెల్లించే స్తోమత లేని వారు ప్రాణాలు అరచేత పట్టుకుని వెనుతిరగాల్సిన దుస్థితి ఏర్పడనుంది.

బకాయిలు విడుదల చేయకపోవడం అన్యాయం

ఆరోగ్యశ్రీకి జవసత్వాలు లేకుండా చేయాలనుకోవడం అన్యాయం. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయినా కూటమి సర్కారు స్పందించకపోతే ఇక పేదలకు వైద్యం ఎలా అందుతుంది? జిల్లాలోని దాదాపు అన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రులకూ రూ.100 కోట్ల బకాయిలు పేరుకుపోయినట్టు వైద్యులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాదిన్నర అవుతోంది. ఇంతవరకూ బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తూంటే పేదల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది.

– గుబ్బల తులసీకుమార్‌, జెడ్పీటీసీ సభ్యుడు, యు.కొత్తపల్లి

పేదల ఆరోగ్యానికి తూట్లు పొడవకండి

పేదల ఆరోగ్యానికి తూట్లు పొడవకండి. నిరుపేదలు, మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం ఒక వరం లాంటిది. ఆ పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చేసినంత మాత్రాన ఆ వర్గాలకు ఒరిగిందేమీ లేదు. ఆరోగ్యశ్రీ రూపురేఖలనే మార్చేస్తున్నారు. సేవలను కుదించేసి ఆ పథకాన్నే నీరుగార్చేసేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నారు. బకాయిలు విడుదల చేయకుండా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం ఉచితంగా చేయమంటే ఎలా చేస్తారు? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిపోయినా ఇంతవరకూ బకాయిలు విడుదల చేయకపోడం అన్యాయం.

– జమ్మలమడక నాగమణి, పౌర సరఫరాల సంస్థ మాజీ డైరెక్టర్‌

నేటి నుంచి నిలిచిపోనున్న

ఎన్టీఆర్‌ వైద్య సేవలు

జిల్లాలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు 32

ఏడాది కాలంగా

రూ.110 కోట్లు పైనే బకాయిలు

నేటి నుంచి సేవల బంద్‌కు ఆషా పిలుపు

ఆరోగ్యశ్రీ.. తీస్తున్నారా ఊపిరి! 1
1/2

ఆరోగ్యశ్రీ.. తీస్తున్నారా ఊపిరి!

ఆరోగ్యశ్రీ.. తీస్తున్నారా ఊపిరి! 2
2/2

ఆరోగ్యశ్రీ.. తీస్తున్నారా ఊపిరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement