
అప్పనపల్లి.. భక్తులతో శోభిల్లి
మామిడికుదురు: బాల తిరుపతి అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆరాధించే స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ప్రాతః కాలంలో ఆలయ అర్చకులు సుప్రభాత సేవ అనంతరం తొలి హారతి ఇచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. స్వామివారి సన్నిధిలో నిత్యం నిర్వహించే శ్రీలక్ష్మీ నారాయణ హోమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,91,093 ఆదాయం సమకూరిందని ఈఓ ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.95.541 విరాళాలుగా అందించారన్నారు. నాలుగు వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని, 2,500 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు.