
భక్తులతో రత్నగిరి కిటకిట
● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది
● ఆలయ ప్రాకారంలో
సత్యదేవుని ఊరేగింపు
అన్నవరం: రత్నగిరిపై శనివారం భక్తులు పోటెత్తారు. రెండో శనివారం సెలవుదినం కావడం, శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెళ్లిళ్లు జరగడంతో ఆ బృందాలతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సుమారు 50 వేల మంది భక్తులు స్వామిని దర్శించి పూజలు చేశారు. దీంతో రత్నగిరిపై పార్కింగ్‌కు స్ధలం లేక భక్తులు తమ వాహనాలను సత్యగిరికి మళ్లించారు.
కాగా స్వామివారి సర్వ దర్శనానికి మూడు గంటలు, రూ.200 టిక్కెట్‌పై అంతరాలయ దర్శనానికి రెండు గంటలు పట్టింది. వెలుపల నుంచే అంతరాలయ దర్శనం కల్పించడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వామివారి వ్రతాలు ఐదు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా ఆలయానికి రూ.50 లక్షలు ఆదాయం సమకూరింది. ఎనిమిది వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.
తిరుచ్చి వాహనంలో ఊరేగింపు
ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవారిని ఉదయం పది గంటలకు తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. అర్చకుడు యడవిల్లి వేంకటేశ్వరరావు పూజలు చేయగా వేద పండితుల మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ మూడు సార్లు ఆలయ ప్రాకారంలో ఊరేగింగించి తిరిగి ఉత్సవ మూర్తులను ఆలయానికి చేర్చారు.