
రత్నగిరికి కొబ్బరి సిరి!
● కొండపైనా, కిందా సుమారు
70 లక్షల కాయల విక్రయం
● రాష్ట్రంలో అధిక వినియోగం ఇక్కడే!
● కార్తికంలో రూ.20 కోట్లకు
పైగా వ్యాపారం జరిగే అవకాశం
● ధర పెరుగుదలతో వ్యాపారుల ఆనందం
అన్నవరం: కొబ్బరికాయ ధర కొండెక్కి కూర్చుంది. ఓ మాదిరి కొబ్బరికాయ రూ.40కి, కాస్త పెద్ద కాయ అయితే రూ.50 కి విక్రయిస్తున్నారు. ఈ పెరుగుదల వ్యాపారులకు సంతోషం కలిగిస్తున్నా భక్తులకు మాత్రం రుచించడం లేదు. గతేడాది కాయ ధర రూ.20 మాత్రమే ఉండగా, ఈ ఏడాది రెట్టింపైందని వారంటున్నారు. కాగా కొబ్బరి తోటలోనే వెయ్యి కాయ ధర రూ.30 వేలకు విక్రయిస్తున్నట్టు రైతులు చెప్తున్నారు.
ఏటా 70 లక్షల కాయల విక్రయం
రత్నగిరికి వచ్చే భక్తులు కొండదిగువన తొలి పావంచా వద్ద, నమూనా ఆలయాల వద్ద ఏటా దాదాపు 70 లక్షలు కొబ్బరికాయలు స్వామి వారికి కొడుతుంటారు.
రాష్ట్రంలోని మరే ఇతర పుణ్యక్షేత్రంలో ఇంత వినియోగం లేదంటే అతిశయోక్తి కాదు. రానున్న కార్తికమాసంలో సుమారు పది లక్షలు కొబ్బరి కాయలు వినియోగిస్తారని, సుమారు రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది.
కార్తికంలో అధిక వినియోగం
ఈ నెల 22వ తేదీ నుంచి మొదలయ్యే కార్తికమాసంలో స్వామివారి సన్నిధికి భక్తులు లక్షలాదిగా వస్తారు. స్వామి వ్రతాలు సుమారు 1.3 లక్షలు జరిగే అవకాశం ఉంటుంది. వ్రతానికి ఆరు కొబ్బరికాయలు వినియోగిస్తారు. ఆ లెక్కన సుమారు ఎనిమిది లక్షల కాయలు వినియోగిస్తారు. ఇవి కాకుండా స్వామివారి దర్శనానికి మరో రెండు లక్షలు కొబ్బరికాయలు, కొండ దిగువన తొలిపావంచా వద్ద, నమూనా ఆలయాల వద్ద భక్తులు కొబ్బరికాయలు కొడతారు. కార్తిక పౌర్ణిమనాడు నిర్వహించే గిరిప్రదక్షణలో సత్యరథం ముందు కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షణలో పాల్గొనడం ఆనవాయితీ కాబట్టి ఆ ఒక్క రోజే పది వేల కాయలు కొనుగోలు చేస్తారు. ఇన్ని కాయల విక్రయం వల్ల సుమారు రూ.మూడు కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుంది.
50కి పైగా కొబ్బరికాయల దుకాణాలు
అన్నవరంలో 50కి పైగా కొబ్బరికాయల దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు వంద కుటుంబాలు బతుకుతున్నారు. ఏటా లక్షలాది కాయలు విక్రయం ద్వారా రూ.కోట్లులో వ్యాపారం జరుగుతోంది.
ఉత్పత్తి తగ్గి.. ధర పెరిగి..
కొబ్బరి ఉత్పత్తి కొంతకాలంగా తగ్గడం ధర పెరుగుదలకు కారణమని రైతులు అంటున్నారు. రాష్ట్రంలో నే కాకుండా, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి. దీనికి తోడు ఉత్తరాది రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతి ఎక్కువగా ఉండడం వల్ల కూడా ధర పెరుగుదలకు మరో కారణమని వారంటున్నారు.
దేవస్థానానికి
రూ.ఆరు కోట్ల ఆదాయం
అన్నవరం దేవస్థానంలో కొబ్బరికాయల దుకాణాల వేలం, వ్రతాలు, ఆలయాలలో కొట్టిన కొబ్బరికాయల ముక్కలు ఏరుకోవడానికి నిర్వహించిన వేలం పాట ద్వారా ఏడాదికి రూ.ఆరు కోట్లు ఆదాయం వస్తోంది. కొబ్బరి ధర పెరగడంతో ముక్కలు తీసుకునే వేలం నెలకు రూ.19.05 లక్షలకు ఖరారైంది. అంటే ఏడాదికి రూ.2.28 కోట్ల ఆదాయం దీని ఒక్కదాని ద్వారానే వస్తోంది.

రత్నగిరికి కొబ్బరి సిరి!