
ప్రమాద రహితంగా బాణసంచా తయారు
కొత్తపేట: ప్రమాద రహితంగా బాణాసంచా తయారీకి యజమానులు, సిబ్బంది ఫైర్ నిబంధనలు పాటిస్తూ , జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. జిల్లాలోని రాయవరం బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం భారీ విస్ఫోటం సంభవించి 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీ రాహుల్ మీనా జిల్లాలోని బాణసంచా తయారీ కేంద్రాల తనిఖీల్లో భాగంగా కొత్తపేట మండల పరిధిలోని బాణసంచా తయారీ కేంద్రాలను, దీపావళి బాణసంచా హోల్‌సేల్ షాపులను గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల లైసెన్స్‌లు, వాటిని రెన్యువల్ చేశారా? ఆయా కేంద్రాల వద్ద, పరిసరాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారా? నిర్లక్ష్యంగా ఉన్నారా? అని నిశితంగా పరిశీలించారు. ఆయా కేంద్రాల యజమానులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. బాణసంచా కేంద్రాల వద్ద అగ్నిమాపక రక్షణ పరికరాలు ఉంచుకోవాలని, ఇసుక, నీరు అందుబాటులో ఉంచాలని, సీసీ టీవీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రమాదం సంభివిస్తే ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా బాణసంచా కేంద్రాల వద్ద ధూమపానం చేయకుండా చూడాలని, మండే గుణం కలిగిన వస్తువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, మైనర్‌లను పనిలో చేర్చుకోరాదని సూచించారు. ఎస్పీ వెంట రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్‌బీ సీఐ పుల్లారావు, కొత్తపేట ఎస్సై జీ సురేంద్ర ఉన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
● నేడు పరావాసుదేవి అలంకరణలో
శేష వాహనంపై ఊరేగింపు
● ముస్తాబైన కోనసీమ తిరుమల క్షేత్రం
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఈ నెల 18 వరకూ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆలయాన్ని, రాజగోపురంతో సహా ఉపాలయాలను, పరిసరాలను ఆ ప్రాంగణాన్ని, రంగు రంగుల పుష్పాలంకరణలు, విద్యుత్ దీప తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామివారు వివిధ అలంకరణలతో విహరించే వాహనాలను ముస్తాబు చేశారు. వాహన సేవలు, నిరంతరాంగా సాగే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. తొలిరోజు ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరుణ, దీక్షాధారణ, విశేషార్చన, నీరాజనం, సాయంత్రం వాస్తు హోమం, ధ్వజ పతాక హోమాలు నిర్వహించనున్నారు. రాత్రి స్వామి వారిని పరావాసుదేవ అలంకరణలో శేషవాహనంపై ఊరేగించనున్నారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు.

ప్రమాద రహితంగా బాణసంచా తయారు