
పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను చెల్లించాలి
● వేతన సవరణ కమిటీని నియమించాలి
● ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్
రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ డిమాండ్
అమలాపురం టౌన్: పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను ఈ ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు చెల్లించాలని, వేతన సవరణ కమిటీని నియమించాలని ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్ ఆలపాటి విద్యాసాగర్ డిమాండ్ చేశారు. అమలాపురం సత్యసాయి కల్యాణ మండపంలో జిల్లా ఎన్‌జీవో సంఘం ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. జిల్లా ఎన్‌జీవో అసోసియేషన్ ఇన్‌చార్జి అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, కూటమి ప్రభుత్వం తమ పట్ల వహిస్తున్న నిర్లక్ష్యంపై చర్చించింది. వేతన సవరణ కమిటీని వేస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదని విద్యాసాగర్ అసహనం వ్యక్తం చేశారు. అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. హెల్త్ కార్డు సిస్టంను క్రమబద్ధీకరణ చేసి ఉద్యోగులకు వైద్యం అందించేలా సహకరించాలన్నారు. రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి డి.వెంకటరమణ, ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ పీఆర్‌సీ కమిషన్‌ను నియమించి, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఎన్‌జీవో అసోసియేషన్‌కు నూతన అడహక్ కమిటీని సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. జిల్లా అధ్యక్షుడిగా మాధవరపు వెంకటేశ్వర్లు, కన్వీనర్‌గా గుత్తుల వెంకటేశ్వరరావు, కోశాధికారిగా గుర్రాల సురేష్ సింగ్, సభ్యులుగా తాడి ఏసుబాబు, రూతమ్మ, సీహెచ్ చిట్టిబాబు, పి.రవిలను సమావేశం ఎన్నుకుంది. అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పేపకాయల వెంకట కృష్ణ, జిల్లా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సాయి ప్రసాదరావుతోతోపాటు జిల్లాలోని తాలూకా యూనిట్స్ కార్యవర్గ ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు.