
పవన్‌కల్యాణ్... ఇప్పుడేం అంటారు?
● లైంగిక వేధింపుల ఘటనపై
మీ సమాధానమేంటి ?
● కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్ సీపీ మహిళా నేత జక్కంపూడి విజయలక్ష్మి
కాకినాడ క్రైం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉన్న జిల్లాలోనే పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరగడం అమానవీయమని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాకి లెక్కలు చూపి మహిళలపై ఘోరాలు జరిగిపోతున్నాయని మొసలి కన్నీరు కార్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడేమంటారని నిలదీశారు. ఘటన నేపథ్యంలో శుక్రవారం ఆమె కాకినాడలోని జీజీహెచ్‌కు వచ్చారు. లైంగిక వేధింపులు చోటు చేసుకున్న ఏడవ నంబరు, అంబానీ ల్యాబ్‌లను పరిశీలించారు. అనంతరం లెక్చర్ గ్యాలరీ సమీపంలో ఉన్న హెచ్‌వోడీ రూంలో ఆసుపత్రి అధికారులతో సమావేశమయ్యారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ల్యాబ్‌లు, వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఈ ఘటనపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి అధికారుల మాటలు పొంతన లేకుండా ఉన్నాయని విమర్శించారు. నిందితులపై నేర చరిత్ర ఉందన్న విషయాన్ని ఉద్దేశ పూర్వకంగానే దాస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కీచకుల మయమని మండిపడ్డారు. శక్తి యాప్ ద్వారా ఉద్దరించిందేంటని నారా లోకేష్‌ను నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న వేలకొద్దీ దుర్యోధనులు, లక్షల కొద్దీ దుశ్సాసనులను శక్తి యాప్ ఏం చేయగలదని ప్రశ్నించారు. కీచకుల కొమ్ము కాస్తున్న కూటమి ప్రభుత్వం బెయిలబుల్ కేసులు పెడుతూ మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. విజయలక్ష్మి వెంట పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తి కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు మహిళా వర్దినీడి సుజాత, కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, పార్టీ మహిళా నేత, కాకినాడ మాజీ మేయర్ సరోజ, మహిళా నేత భవానీ ప్రియ ఉన్నారు.