సర్కారు వారి బీమా కలాపం! | - | Sakshi
Sakshi News home page

సర్కారు వారి బీమా కలాపం!

Jul 12 2025 9:43 AM | Updated on Jul 12 2025 9:57 AM

అప్పులతో సతమతం

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు అప్పులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏ విధమైన ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు ప్రయివేటు వ్యాపారస్తులు దగ్గర నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఏడాది రైతు నేస్తం కింద ఇస్తామన్న రూ. 20 వేలు కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ప్రస్తుతం రైతులు ఖరీఫ్‌ సాగుకు సిద్ధమయ్యారు. మే నెలలో రైతు నేస్తం ఇస్తామన్నారు. జూన్‌ నెల కూడా అయిపోయింది. జులై వచ్చినా ఇంకా రైతు నేస్తం డబ్బు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ప్రస్తుతం రైతులు పెట్టుబడి కోసం అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో బీమా ప్రీమియం కూడా తాము చెల్లించాలని చెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రీమియం డబ్బు కోసం ఎక్కడ అప్పు చేయాలో అర్థం కాక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబునాయుడు మాటలు నమ్మి తాము మోసపోయామని గత రబీలో ధాన్యం డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూనే తమ పైనే అదనపు భారం మోపడం న్యాయం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాకు మంగళం

రైతులపై ప్రీమియం భారం రూ.16 కోట్లు

ఎకరాకు రూ.760 చొప్పున చెల్లించాలి

వైఎస్సార్‌ సీపీ హయాంలో

ఐదేళ్లూ ఉచితం

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో

2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు

ఆందోళన చెందుతున్న అన్నదాతలు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): విత్తు దగ్గర నుంచి కుప్ప నూర్పిడి వరకూ రైతులకు అండగా నిలిచే ఉచిత పంటల బీమా పథకానికి కూటమి ప్రభుత్వం ఎగనామం పెట్టింది. రైతులకు పంట బీమా కావాలంటే ఎకరా వరి పొలానికి రూ.769 రైతులే చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేస్తున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు వరినారు వేసుకొని పంటలు దమ్ము చేసుకొంటున్నారు. ఖరీఫ్‌ సాగుకు సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉచిత పంటల బీమా పథకం ఊసు తేవడం లేదు. రైతులు సొంతంగా పంట బీమా చేయించుకోవాలని మండల వ్యవసాయశాఖ ఆధికారుల ద్వారా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు అన్నీ చేస్తామని చెప్పి తీరా చూస్తే ప్రతీ పథకానికి గండి కొడుతున్నారని రైతులు మండిపడుతున్నారు.

తాము అధికారంలోకి వస్తే రైతు నేస్తం పథకం కింద ప్రతీ ఏడాది రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గత సంవత్సరం ఖరీఫ్‌, రబీలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సహాయం చేయకుండా రైతులను మోసం చేసిన కూటమి సర్కార్‌ ప్రస్తుతం పంట బీమా పథకానికి మోకాలడ్డు వేసింది. దీంతో జిల్లాలో రైతులపై రూ.16 కోట్ల భారం పడనుంది.

బీమా భారమంతా రైతులు పైనే..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంట బీమా పథకం అమలు చేసింది. రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండా పంట బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించేది. ప్రతీ ఏడాది కాకినాడ జిల్లాలో రూ.16 కోట్లు పైబడి ప్రభుత్వం చెల్లించేది. వైఎస్సార్‌ సీపీ ఐదేళ్ల పాలనలో రైతుల నుంచి ప్రీమియం కోసం ఏనాడూ డబ్బు వసూలు చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాదితోపాటు ఈ ఏడాది కూడా పంటల బీమా పథకం అమలు చేయకుండా రైతులపైనే భారం వేస్తోంది. గ్రామాల్లో ఐదారెకరాలు సాగుచేసే రైతులు సుమారు రూ.4 వేలలో ప్రస్తుతం పంట బీమా చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రీమియం చెల్లించకుంటే దక్కని బీమా

రైతులు ప్రీమియం చెల్లించకుంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక్క రూపాయి కూడా బీమా వర్తించదు. ఖరీఫ్‌లో వరి సాగు చేసే రైతులకు నవంబర్‌, డిసెంబర్‌ నెలలో వచ్చే తుపాన్ల కారణంగా నష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఎకరా వరి పొలానికి రూ.769 ప్రీమియం చెల్లిస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఎకరాకు రూ.6 వేల వరకూ నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు ఎవరైనా ప్రీమియం చెల్లించకుంటే పరిహారం రాదు.

గతంలో ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లించడంతో ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రతీ రైతుకు పంట నష్ట పరిహారం వచ్చేది. ప్రస్తుతం ప్రీమియం చెల్లించేందుకు చాలామంది రైతుల వద్ద డబ్బు లేని పరిస్థితి. రైతులు బ్యాంకుల నుంచి అప్పు తీసుకొంటే ప్రీమియంను మినహాయించి మిగిలిన సొమ్ము ఇస్తారు. దీంతో రుణాలు తీసుకొనే ప్రతీ రైతుకు పంట బీమా వర్తిస్తుంది. జిల్లాలో సుమారు లక్ష మందిలోపు మాత్రమే రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొంటారు. మిగిలినవారు సొంతంగా పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలి

ఉచిత పంటల బీమా పథకం ఎత్తివేయడంతో రైతులపై ప్రీమియం భారం పడుతోంది. నేను 5 ఎకరా లు సాగు చేస్తున్నాను. దీంతో రూ.3,845 ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. గతంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది. దీంతో రైతులపై ఎటువంటి భారం ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతోంది తప్ప, రైతులకు ఏ విధమైన పథకాలు అమలు చేయడం లేదు.

– తుమ్మల అచ్చియ్య, రైతు పులిమేరు, పెద్దాపురం మండలం

రైతులను ప్రీమియం చెల్లించమనడం దారుణం

నాకు ఉన్న భూమితోపాటు అదనంగా మరో 7 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాను. దీంతో పది ఎకరాలకు రూ.7,690 ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. ఇప్పడే డబ్బు లేక విత్తనాలు కొనుగోలుకు బయట అప్పులు తెచ్చాను. మళ్లీ ప్రీమియం కట్టాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఏమీ చేయాలో అర్థం కానీ పరిస్థితి. గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఐదు సంవత్సరాలూ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది. ప్రస్తుతం రైతులను ప్రీమియం చెల్లించడమనడం దారుణం.

– సుర్ల నాగేశ్వరరావు, రైతు టీజే నగరం, కోటనందూరు మండలం

సర్కారు వారి బీమా కలాపం!1
1/2

సర్కారు వారి బీమా కలాపం!

సర్కారు వారి బీమా కలాపం!2
2/2

సర్కారు వారి బీమా కలాపం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement