తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు

Jul 13 2025 7:37 AM | Updated on Jul 13 2025 7:37 AM

తొలి

తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు

పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో వెలసిన స్వయంభూ శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సుమారు 25 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా దేవస్థానానికి రూ.3,73,904 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. ఐదు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.

శాకంబరిగా

నేడు తలుపులమ్మ దర్శనం

తుని రూరల్‌: ఆషాఢ మాసం మూడో ఆదివారం కావడంతో తలుపులమ్మ అమ్మవారు నేడు శాకంబరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో విశేషంగా అలంకరించి, భక్తులకు దర్శనం కల్పించనున్నట్టు డిప్యూటీ కమిషనర్‌, లోవ దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ అమ్మవారి దర్శనాలకు భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు.

లోవ భక్తులకు

సత్యదేవుని ప్రసాదం సిద్ధం

అన్నవరం: ఆషాఢ మాసం మూడో ఆదివారం తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి లోవ వెళ్లి వచ్చే భక్తులకు సత్యదేవున్ని గోధుమ నూక ప్రసాదం సిద్ధమవుతోంది. వారికి విక్రయించేందుకు లక్షకు పైగా సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. గత ఆదివారం కొండ దిగువన, జాతీయ రహదారిపై ఉన్న నమూనా ఆలయాల వద్ద లోవ భక్తులు సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సుమారు 60 వేలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదివారం అంతకన్నా ఎక్కువగా కొనుగోలు చేస్తారనే అంచనాతో అన్నవరం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం సుమారు 60 వేలలు, లోవ భక్తుల కోసం సుమారు లక్ష ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రసాదాల విక్రయాల ద్వారా ఆదివారం సుమారు రూ.30 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కిక్కిరిసిన రత్నగిరి

అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి శనివారం భక్తులు వేలాదిగా పోటెత్తారు. రెండో శనివారం, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో ఉదయం నుంచే స్వామివారి సన్నిధికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో, ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో ఉదయం సత్యదేవుడు, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ఆలయానికి ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుంచి ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగిస్తారు.

రేపు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం

కాకినాడ సిటీ: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌ హాలులో సోమవారం ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకూ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులదరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. మండల స్థాయిలో జరిగే పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి ఆయా మండలాల అధికారులందరూ విధిగా ఉదయం 9.30 గంటలకే హాజరు కావాలని సూచించారు.

తొలి తిరుపతికి  పోటెత్తిన భక్తులు 1
1/1

తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement